డెంగీతో ఎవరూ చనిపోలె: ఈటల

డెంగీతో ఎవరూ చనిపోలె: ఈటల

ఇప్పటివరకు డెంగీ వల్ల ఎవరూ చనిపోలేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జ్వరాల గురించి ప్రతి ఇన్ఫర్మేషన్‌‌‌‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుసుకుంటున్నారని, సోమవారం కూడా సమీక్ష నిర్వహించారని తెలిపారు. మంగళవారం హైదరాబాద్ లోని ఫీవర్ ఆస్పత్రిని ఆయన పరిశీలించారు. వివిధ వార్డుల్లో రోగులతో మాట్లాడి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఓపీ, డెంగీ పరీక్ష (అలీసా) కౌంటర్లను పెంచాలని ఆదేశించారు. ఉస్మానియా, గాంధీ, ఫీవర్ హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్లో సెలవు రోజుల్లో కూడా ఓపీ సేవలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరో నాలుగు వారాల పాటు రోజంతా ఓపీ సేవలు అందిస్తామన్నారు. డెంగీ పరీక్షలు పూర్తిగా ఉచితంగా చేస్తున్నామని,  ప్రతి హాస్పిటల్‌‌‌‌లో బోర్డులు కూడా పెట్టినట్లు చెప్పారు. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలను తీసుకోవాలని, సరిగా పని చేయని డాక్టర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రూ. 4.2 కోట్లతో 12 హాస్పిటళ్లలో ప్లేట్ లెట్స్‌‌‌‌ను వేరు చేసే యంత్రాలను మూడు నెలల క్రితమే అందుబాటులో ఉంచామన్నారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నవారికి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి, హాస్పిటల్‌‌‌‌కు వచ్చిన 20 నిమిషాల్లోనే ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ అందించే ఏర్పాటు చేశామన్నారు. రద్దీ తగ్గేవరకు మరో 15 కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. జూన్‌‌‌‌లో ఫీవర్ హాస్పిటల్‌‌‌‌కు 25 వేల మంది వస్తే తొమ్మిది డెంగీ కేసులు, ఆగస్టులో 51 వేల మంది వస్తే 61 కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు.

దోమల నియంత్రణకు చర్యలు

చెరువులు, కుంటలు, మూసీ నదిపై డ్రోన్ల సాయంతో స్ప్రేయింగ్ చేస్తున్నామని మంత్రి ఈటల చెప్పారు. 15 రోజులకోసారి ప్రతి స్కూల్‌‌‌‌లో ఫాగింగ్ చేస్తున్నామన్నారు. జీహెచ్‌‌‌‌ఎంసీలో 309 డెంగీ,151 మలేరియా వచ్చే ప్రదేశాలను గుర్తించామని, అక్కడ దోమల నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఫ్రైడే ను డ్రై డేగా పాటించాలని సూచించినట్లు తెలిపారు. కేవలం తెలంగాణలో మాత్రమే డెంగీ వస్తున్నట్లు కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రం తాజాగా ఇచ్చిన రిపోర్ట్  ప్రకారం పశ్చిమ బెంగాల్‌‌‌‌లో 5,046 , ఉత్తరాఖండ్‌‌‌‌లో 2,081, మహారాష్ట్రలో 2,061, కర్నాటకలో 1,471, గుజరాత్‌‌‌‌లో 1,148 , మన రాష్ట్రంలో 530 కేసులు నమోదయ్యాయని వివరించారు. రాజకీయ లబ్ధి కోసం జ్వరాల అంశాన్ని వాడుకోవద్దని మంత్రి ఈటల విజ్ఞప్తి చేశారు.

డెంగీతో చిన్నారి మృతి

జగదేవపూర్, వెలుగు: నీలోఫర్ ఆస్పత్రిలో డెంగీకి చికిత్స పొందుతూ సిద్దిపేట జిల్లాకు చెందిన చిన్నారి మంగళవారం చనిపోయింది. జగదేవపూర్ మండలం గొల్లపల్లికి చెందిన కరుణాకర్, కవిత దంపతుల కూతురు సహస్ర(7) కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో హైదరాబాద్​లోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. బ్లడ్ శాంపిల్స్ పరీక్షించిన డాక్టర్లు డెంగీ వ్యాధిగా నిర్ధారించి ట్రీట్ మెంట్ అందించారు. వ్యాధి తీవ్రత మరింత ఎక్కువ కావడంతో మంగళవారం ఉదయం చిన్నారి సహస్త్ర చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.