గతం కంటే పదింతల శక్తితో సంఘ్ పై పోరాడుతాం: రాహుల్

గతం కంటే పదింతల శక్తితో సంఘ్ పై పోరాడుతాం: రాహుల్

డిఫమేషన్ కేసులో ముంబై కోర్టుకు హాజరు.. బెయిల్ మంజూరు

ముంబై: సంఘ్​ పరివార్​ దేశంపై ఆక్రమణ చేస్తోందని, గతంలో కంటే పదింతలు ఎక్కువ శక్తితో దానిపై పోరాడుతానని కాంగ్రెస్​ పార్టీ మాజీ చీఫ్​ రాహుల్​ గాంధీ చెప్పారు. పేదలు, రైతులు, కూలీల తరఫున నిలబడుతూనే, ఆర్​ఎస్​ఎస్​తో ఐడియాలజికల్​ వార్​ కొనసాగిస్తానని స్పష్టం చేశారు. డిఫమేషన్​ కేసులో విచారణ కోసం గురువారం ముంబైలోని మజ్​గావ్​ మెట్రోపాలిటన్​ కోర్టుకు హాజరయ్యారు. రూ.15వేల సెక్యూరిటీ, షూరిటీ సంతకాలపై కోర్టు ఆయనకు బెయిల్​ మంజూరుచేసింది. రాజీనామా వాపస్​ తీసుకోవాలంటూ కాంగ్రెస్​ కార్యకర్తలు కోర్టు ఆవరణలోనే ఆందోళనకు దిగారు. ఆ గందరగోళం మధ్యే ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ నేతల రాజీనామాల పర్వం గురువారం కూడా కొనసాగింది. కొత్త కమిటీలు ఏర్పాటుచేసేందుకు వీలుగా చాలా రాష్ట్రాల్లో పలువురు ఆఫీస్​ బేరర్లు పదవులు వదిలేశారు. రాహుల్​ రాజీనామాను పార్టీ శ్రేణులందరూ వ్యతిరేకిస్తున్నా, ప్రియాంక గాంధీ మాత్రం సమర్థించారు. ఈ మేరకు ఆమె చేసిన ట్వీట్​ వైరలైంది.

రాహుల్​ నాట్​ గిల్టీ

ఎన్నికల సందర్భంలో ప్రధాని మోడీపై కామెంట్లు చేసి, కోర్టుకు సారీ చెప్పిన రాహుల్​ గాంధీ బుధవారం నాటి లేఖలోనూ బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​పై తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. ప్రజల మధ్య విద్వేషాలు, విభేదాలు సృస్టించడమే బీజేపీ, ఆర్​ఎస్​ఎస్ లక్ష్యమమని రాహుల్​ ఆరోపించారు. కాగా, అదే ఆర్​ఎస్​ఎస్​పై గతంలో కామెంట్లు చేసిన కేసులో ఆయన గురువారం ముంబై కోర్టు ముందు  హాజరయ్యారు. 2017లో జర్నలిస్ట్​ గౌరీ లంకేశ్ హత్యకు గురైన సందర్భంలో.. ‘ఆమె బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​కు వ్యతిరేకంగా మాట్లాడినందుకే హత్యకు గురయ్యారు’ అని రాహుల్​ అన్నారు. దాన్ని తప్పుపడుతూ ముంబైకి చెందిన ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్త దృతిమాన్​ జోషి పరువునష్టం దావా వేశారు. రాహుల్​ నేరాన్ని అంగీకరించడం లేదంటూ(నాట్​ గిల్టీ) ఆయన తరఫు న్యాయవాది చెప్పడంతో ట్రయల్​ మొదలుపెడుతున్నట్లు జడ్జి ప్రకటించారు. ఇదే కేసులో  సీపీఎం నేత సీతారాం ఏచూరి కూడా నేరాన్ని అంగీకరించలేదు. దీంతో ఇద్దరు నేతలకు తలా రూ.15వేల సెక్యూరిటీ, స్థానికవ్యక్తి(కాంగ్రెస్​ మాజీ ఎంపీ ఏక్​నాథ్​ గైక్వాడ్​) షూరిటీ సంతకంపై బెయిల్​ లభించింది. రాహుల్​, ఏచూరిలకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చిన జడ్జి.. విచారణకు సెప్టెంబర్​ 22కు వాయిదావేశారు.

ప్రియాక గాంధీ ట్వీట్​ వైరల్​​

ఏఐసీసీ నుంచి బూత్​ కమిటీల దాకా రాహుల్​ రాజీనామాను వ్యతిరేకిస్తుండగా, ప్రియాంక గాంధీ మాత్రం అన్నకు మద్దతుగా నిలిచారు. ‘‘అన్న నిర్ణయాన్ని మనస్పూర్తిగా గౌరవిస్తున్నా. ఇలా ధైర్యంగా అడుగేయగల సత్తా కొద్దిమందికే ఉంటుంది’’అంటూ ప్రియాంక ట్వీట్​ చేశారు.

ప్రకాశ్​ అంబేద్కర్​తో కాంగ్రెస్​ పొత్తు!

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రజా సమస్యలపై అగ్రెసివ్​గా పోరాడాలని కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్​ సూచించారు.  ముంబై ఎయిర్​పోర్టులో నేతలతో మాట్లాడారు. ప్రకాశ్​ అంబేద్కర్​ నాయకత్వంలోని వంచిత్​ బహుజన్​ అఘాడీ (వీబీఏ) పార్టీతో ప్రీపోల్​ అలయెన్స్​కు కాంగ్రెస్​ రెడీగా ఉందని ఆ పార్టీ సీనియర్​ నేత విజయ్​ వడెట్టివర్​ ప్రకటించారు. మహారాష్ట్రలో ఇప్పటికే ఎన్సీపీతో కలిసి సాగుతున్న కాంగ్రెస్​.. బీజేపీ వ్యతిరేక శక్తులను ఒక్కగూటికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నది.  మహారాష్ట్ర అసెంబ్లీకి అక్టోబర్​లో ఎన్నికలు జరిగే అవకాశముంది.

ఆర్​ఎస్​ఎస్​ నకిలీల అడ్డా: కాంగ్రెస్

పదింతలు రెట్టింపు శక్తితో సంఘ్​పై పోరు ఉధృతం చేస్తానని ముంబైలో రాహుల్​ ప్రకటించిన కొద్ది సేపటికే కాంగ్రెస్​ పార్టీ రంగంలోకి దిగింది. ‘‘ఆర్​ఎస్​ఎస్​ వర్సెస్​ ఇండియా” పేరుతో కొత్త క్యాంపెయిన్​ మొదలుపెట్టింది. అందులో భాగంగా  ‘ఆర్​ఎస్​ఎస్​ నకిలీల అడ్డా’ అంటూ ఓ విమర్శనాత్మక వీడియో రిలీజ్​ చేసింది. స్వాతంత్ర్యపోరాటంలో పాలుపంచుకోని సంఘ్​.. బ్రిటిషర్లకు అనుకూలంగా పనిచేసిందని, గాంధీని చంపిన గాడ్సేకు రివాల్వర్​ ఇచ్చింది ఆ సంస్థ నేతలేనని, నాజీ జర్మనీ స్ఫూర్తితో ‘డిజైనర్​ ఆర్యన్​ బేబీ’ ప్రాజెక్ట్​కు రూపకల్పన చేశారని, ఇండియాలో సెర్వికల్​ క్యాన్సర్​ వ్యాక్సిన్​ తయారీని నిలిపేసేలా మోడీని ఒప్పించారని, శత్రువు కుటుంబాల్లోని ఆడపిల్లల్ని రేప్​ చేయడాన్ని సావర్కర్​ సమర్థించారని కాంగ్రెస్​ పార్టీ వీడియోలో ఆరోపించింది. దీనిపై సంఘ్​ ఇంకా స్పందించాల్సిఉంది.