
అభయహస్తం అప్లికేషన్లకు రేషన్‌కార్డుతో పాటు ఆధార్‌కార్డును జత చేయాలని ప్రభుత్వం తెలిపింది. రేషన్‌కార్డు లేనోళ్లు కూడా అప్లై చేసుకోవచ్చని చెప్పింది. దీంతో కొత్త రేషన్ కార్డు కోసం వినతిపత్రం ఇవ్వడంతో పాటు అభయహస్తం గ్యారంటీలకు కొంతమంది అప్లై చేసుకుంటున్నారు. అయితే రేషన్ కార్డు లేని కొందరు ఇన్కమ్ సర్టిఫికెట్‌ను జత చేస్తుండడం, మరికొందరు దరఖాస్తులతో పాటు క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా ఇస్తుండడంతో కొంత గందరగోళం నెలకొన్నది.
క్యాస్ట్, ఇన్కమ్సర్టిఫికెట్లు గానీ, ఓటరు కార్డు గానీ జత చేయాలని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. దీనిపై అధికారులు కూడా క్లారిటీ ఇచ్చారు. కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో ఏ వర్గమో టిక్చేస్తే సరిపోతుందని.. దానికోసం క్యాస్ట్సర్టిఫికెట్ పెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇన్కమ్ సర్టిఫికెట్‌కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు.
అప్లికేషన్లు ఫ్రీ.. ఎవరూ కొనొద్దు..
అభయహస్తం అప్లికేషన్లను అమ్మి కొందరు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జిరాక్స్ సెంటర్ల వద్ద కొందరు ఒక్కో అప్లికేషన్‌ను రూ.50 నుంచి రూ.100కు అమ్ముతున్నారు. ఉదయం నుంచి లైన్‌లో వేచి చూసినా దరఖాస్తు ఫారమ్స్ ఇవ్వడం లేదని కొన్నిచోట్ల ప్రజలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ కేపీహెచ్‌బీ రమ్య గ్రౌండ్ వార్డు కార్యాలయంలో అప్లికేషన్లు ఇవ్వడం లేదని స్థానికులు నిరసన తెలిపారు. అయితే అప్లికేషన్లు అందుబాటులో లేకపోవడం, కొందరు వాటిని అమ్ముతుండడంపై ప్రభుత్వం స్పందించింది. అప్లికేషన్లు ఫ్రీగా అందజేస్తామని, ఎవరూ కొనొద్దని తెలిపింది.
‘‘అభయహస్తం అప్లికేషన్లను ప్రభుత్వమే ఫ్రీగా ఇస్తుంది. గ్రామ సభలు జరిగే ప్రాంతాల్లో ఒకట్రెండు రోజుల ముందే పంపిణీ చేస్తుంది. ఎవరు కూడా డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. గ్రామసభ నిర్వహించే రోజు కూడా సంబంధిత గ్రామసభలో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి” అని ప్రకటించింది. ఎవరైనా అప్లికేషన్ ఫారమ్స్ అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.