సేవ చేయించుకోవడానికి కాదు.. చేయడానికి వచ్చా.. రాజుగా ప్రమాణం చేసిన కింగ్ చార్లెస్ III

సేవ చేయించుకోవడానికి కాదు.. చేయడానికి వచ్చా.. రాజుగా ప్రమాణం చేసిన కింగ్ చార్లెస్ III

లండన్‌లో కింగ్ చార్లెస్ పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. వెస్ట్‌మినిస్టర్ అబేలో సెయింట్ ఎడ్వర్ట్ కిరీటాన్ని ధరించిన 40వ బ్రిటన్ చక్రవర్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తన పాలనలో చట్టాలను, ఇంగ్లండ్ చర్చిని గౌరవిస్తానని చెప్పారు. తాను సేవ చేయించుకోవడానికి కాదు..సేవ చేయడానికి వచ్చానంటూ చార్లెస్ వ్యాఖ్యానించారు. తన బాధ్యతలకు కట్టుబడి ఉంటానంటూ ఆయన బైబిల్ మీద ప్రమాణం చేశారు. అనంతరం ఆర్చ్ బిషప్ కాంటర్‌బరీ కింగ్‌ ను భగవంతుడు రక్షిస్తాడని (గాడ్ సేవ్ కింగ్) ప్రకటించారు.

అంతకుముందు కింగ్ చార్లెస్III, క్వీన్ కాన్సర్ట్ కామిలాతో కలిసి బకింగ్ హమ్ ప్యాలెస్ నుంచి వెస్ట్‌మినిస్టర్ అబే కు బంగారు రథంలో బయలుదేరారు. వెస్ట్‌మినిస్టర్ అబేకు చేరుకున్న కింగ్ చార్లెస్ III, సుమారు 2200 మంది దేశవిదేశాలకు చెందిన అతిథుల సమక్షంలో పట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆర్చ్ బిషప్ కాంటర్‌బరీ పూర్తిగా క్రైస్తవ మత సంప్రదాయంలో నిర్వహించారు. బంగారు రథం ప్రయాణించే మార్గంలో వేలమంది కాబోయే రాజును చూసేందుకు బారులు తీరారు. కింగ్ చార్లెస్, కామిల్లా ప్రజలకు అభివాదం చేస్తూ వెస్ట్‌మినిస్టర్ అబే కు వెళ్లడం అందర్నీ ఆకర్షించింది. కాగా అబే ప్రాంతానికి సామాన్యులకు అనుమతి లేదని ప్రభుత్వం ఇంతకు ముందే ప్రకటించింది.