భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన విలీన ఆంధ్రప్రదేశ్‌లోని ఎటపాక మండలం పురుషోత్తపట్నం ప్రాంత భూముల్లో అక్రమంగా ఇళ్లు నిర్మించిన వారికి మంగళవారం దేవస్థానం అధికారులు నోటీసులు జారీ చేశారు. పురుషోత్తపట్నంలో స్వామివారికి చెందిన సుమారు 800 ఎకరాల భూములు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ భూములను కొంతమంది రైతులు ఆక్రమించి వ్యవసాయం చేస్తున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇటీవలే రైతులు కౌలు చెల్లించడం ప్రారంభించినట్లు సమాచారం.
అయితే కొందరు ఆక్రమణదారులు శాశ్వత భవనాలు నిర్మించడం పట్ల దేవస్థానం అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములపై సర్వే నిర్వహించి, పరిస్థితిని ఎండోమెంట్ కమిషనర్‌కు నివేదించారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఆక్రమణదారులకు నోటీసులు అందజేస్తూ, వెంటనే అక్రమ నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించాలని హెచ్చరించారు.
లేనిపక్షంలో దేవస్థానం తరఫునే కూల్చివేత చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ప్రస్తుతం అక్కడ సుమారు 100కు పైగా శాశ్వత భవనాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా దేవస్థానం బృందం నిర్మాణాల ఫొటోలు, వీడియోలు కూడా సేకరించింది. రెండు రోజుల్లో భవనాలను తొలగించాలని ఆక్రమణదారులకు సూచించినట్లు అధికారులు తెలిపారు.
