రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్​కు నోటీసులు: గంగుల కమలాకర్​

రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్​కు నోటీసులు: గంగుల కమలాకర్​
  • రేవంత్​ ఒత్తిడితోనే  కమిషన్​ నోటీసులిచ్చింది: గంగుల కమలాకర్​

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సాధించిన కేసీఆర్​కు కాళేశ్వరం కమిషన్​ నోటీసులు ఇవ్వడంతో ప్రజలు బాధపడుతున్నారని, తెలంగాణ సమాజం ఒక్కసారిగా ఉలిక్కి పడిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ ఎమ్మెల్యే గంగుల కమలాకర్​ అన్నారు. కేసీఆర్​కు నోటీసులు ఇవ్వడమంటే యావత్​ తెలంగాణ సమాజానికి, కాళేశ్వరం కింద పంటలు పండించుకున్న రైతులకు నోటీసులు ఇవ్వడమేనన్నారు. ఇంకా ఎవరినీ పిలవం.. విచారణ పూర్తయిందని కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ పీసీ ఘోష్​ చెప్పారని.. కానీ, సీఎం రేవంత్​రెడ్డి ఒత్తిడితోనే జస్టిస్​ఘోష్​ తన వైఖరి మార్చుకుని కేసీఆర్, హరీశ్ రావుకు నోటీసులిచ్చారని అన్నారు.

ఆ నోటీసులు పూర్తిగా రాజకీయ దురుద్దేశం, కక్షతో కూడుకున్నవని అన్నారు. బుధవారం ఆయన బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలతో కలిసి తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు. నోటీసులు ఇప్పించి రేవంత్​ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. ఇల్లు కట్టేటప్పుడు బాత్రూం లీక్​ అయితే ఇల్లంతా కూలగొట్టుకుంటామా? అని ప్రశ్నించారు. మేడిగడ్డకు రిపేర్లు చేయించనందుకు అసలు రేవంత్​ రెడ్డి మీద కమిషన్​ వేయాలని అన్నారు. గుల్జార్​ హౌస్​ ఘటన, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల దందాల నుంచి డైవర్ట్​ చేసేందుకే కమిషన్​నోటీసులతో చిల్లర రాజకీయాలకు తెరలేపారన్నారు. 

కాళేశ్వరం కూలిందన్న విషప్రచారం మానుకోవాలి: సుధీర్​ రెడ్డి

సీఎంగా రేవంత్​ రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఎల్బీనగర్​ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​రెడ్డి అన్నారు. సీఎం పదవి వచ్చింది కేసీఆర్​కు నోటీసులు ఇచ్చేందుకు కాదన్న విషయాన్ని రేవంత్​ గ్రహించాలన్నారు. కాళేశ్వరం కూలిపోయిందని రేవంత్​దివాలాకోరు ప్రచారం చేస్తున్నారన్నారు. ఆ విష ప్రచారాన్ని వెంటనే మానుకోవాలన్నారు. రేవంత్​ సీఎం అయ్యాక ఎన్నో ప్రమాదాలు జరిగాయని, వాటిపై కమీషన్లు వేశారా? అని ప్రశ్నించారు.

అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్ముతారంటూ రేవంత్​ రెడ్డి గతంలో చెప్పారని, ఇప్పుడూ అవే అబద్ధాలు చెబుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​విమర్శించారు. పాలన చేతగాక.. సమస్యలు పరిష్కరించలేకే కేసీఆర్​కు నోటీసులిచ్చారని సత్యవతి రాథోడ్​అన్నారు. ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుదాకా నీళ్లు రావడానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టేనన్నారు. కాగా, ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శంభీపూర్​ రాజు, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, బండారి లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్​ పాల్గొన్నారు.