
- ఈ నెల 15కల్లా వివరణ ఇవ్వాలని జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఆదేశాలు
- చత్తీస్‌గఢ్‌తో అగ్రిమెంట్ వద్దని అధికారులు చెప్పినా బీఆర్ఎస్ సర్కారు వినలే
- భారీగా ఖర్చు చేసి కరెంట్ కొన్నరు.. ఎంత నష్టం జరిగిందో తేలుస్తం
- టెండర్లు లేకుండా భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్స్ నిర్మాణ పనులు
- భద్రాద్రి థర్మల్ ప్లాంట్‌లో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ
- ఇప్పటివరకు కేసీఆర్ సహా 25 మందికి నోటీసులు
- వివరణ సంతృప్తికరంగా లేకుంటే వ్యక్తిగతంగా అటెండ్ కావాల్సిందే
- మాజీ సీఎండీ ప్రభాకర్‌రావు, ఎస్కే జోషి, అర్వింద్ కుమార్‌నూ విచారించాం
- మీడియాతో చిట్‌చాట్‌లో జస్టిస్ నర్సింహారెడ్డి సంచలన విషయాలు
హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్‌కొనుగోలు ఒప్పందాల్లో అవకతవకలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ మరోసారి నోటీసులు అందజేసింది. ఈ నెల 15వ తేదీకల్లా కేసీఆర్ తన వివరణను అందజేయాలని స్పష్టం చేసింది. గత ఏప్రిల్ నెలలోనే కేసీఆర్‌కు నోటీసులు పంపినప్పటికీ జులై 30 వరకు తాను వివరణ ఇవ్వలేనని కేసీఆర్ నుంచి సమాధానం వచ్చింది.
కానీ ఎంక్వైరీకి గడువు తక్కువగా ఉండడంతో ఈ నెల 15లోగా ఎట్టి పరిస్థితుల్లోనూ వివరణ పంపాలని, సమాధానం సంతృప్తికరంగా లేకుంటే వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని మరోసారి నోటీస్ పంపినట్టు జస్టిస్ నర్సింహారెడ్డి మంగళవారం వెల్లడించారు. గత సర్కారు హయాంలో చత్తీస్‌గఢ్‌తో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణ పనుల్లో అక్రమాలు నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో జ్యుడీషియల్ కమిషన్ వేసింది. ఇటీవల విచారణను స్పీడప్ చేసిన జస్టిస్ నర్సింహారెడ్డి, ఇందుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను బీఆర్కే భవన్లో మీడియాతో చిట్‌చాట్ చేశారు.
ఇప్పటివరకు 25 మందికి నోటీసులు
చత్తీస్‌గఢ్ తో విద్యుత్ ఒప్పందాలు, టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్స్ నిర్మాణ పనుల కేటాయింపు.. ఈ మూడు అంశాలపై విచారణ కొనసాగుతోందని జస్టిస్ నర్సింహారెడ్డి చెప్పారు. ఈ మూడు నిర్ణయాలు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే తీసుకుందని, దీంతో జెన్కోకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. విద్యుత్ ఒప్పందాలతోపాటు థర్మల్‌ప్లాంట్ల పై ఎంక్వైరీ స్పీడ్‌గా జరుగుతోందని, ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు 25 మందికి నోటీసులు ఇచ్చామని వెల్లడించారు.
‘ఇప్పటికే చాలా మంది నుంచి వివరణలు వచ్చాయి. విద్యుత్ సంస్థల మాజీ సీఎండీలు, ప్రస్తుత సీఎండీని కూడా విచారించాం. సోమవారం ట్రాన్స్‌కో, జెన్కో మాజీ సీఎండీ ప్రభాకర్ రావు, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ చందాను విచారించాం. మంగళవారం అప్పటి ఇంధనశాఖ ప్రిన్సిపల్సెక్రటరీలు ఎస్కే జోషి, అర్వింద్ కుమార్ తో సమావేశమయ్యాం. వివరాలు తీసుకున్నాం’ అని జస్టిస్ నర్సింహారెడ్డి తెలిపారు.
అర్వింద్‌కుమార్ లేఖనూ పట్టించుకోలే..
చత్తీస్‌గఢ్ ఒప్పందాన్ని తప్పు పడుతూ అప్పట్లో ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అర్వింద్ కుమార్ ఈఆర్సీకి లెటర్ రాసినా ప్రభుత్వం పట్టించుకోలేదని తమ విచారణలో తేలినట్టు జస్టిస్ నర్సింహారెడ్డి చెప్పారు. ‘రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగినప్పుడు కేంద్రానికి మధ్యవర్తిత్వం ఇవ్వాలి. కానీ ఈ ఒప్పందంలో చత్తీస్ గఢ్‌కు అధికారం ఇచ్చారు. భారీగా నిధులు ఖర్చు చేసి కరెంటు కొనుగోలు చేశారు. మొత్తం ప్రక్రియలో ఎంత నష్టం జరిగిందనేది తేలాల్సి ఉంది. భద్రాద్రి థర్మల్ ప్లాంట్‌లో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడారు.
భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణ పనులకు టెండర్లు పిలవకుండా నామినేషన్పద్ధతిలో కట్టబెట్టారని ప్రాథమిక అంచనాకు వచ్చాం. ఇప్పటికీ యాదాద్రి థర్మల్‌ప్లాంట్ నిర్మాణం పూర్తి కాలేదు. ఆగస్టు వరకు ఒక ప్లాంట్ అందుబాటులోకి వస్తుందని అంటున్నారు. కానీ రైల్వే లైన్ ఇప్పటికీ వెయ్యలేదు. అధికారుల నుంచే కాకుండా పలువురు విద్యుత్ రంగ ప్రముఖులు నుంచి కూడా పలు రకాల సమాచారం తీసుకుంటున్నాం’ అని జస్టిస్ నర్సింహారెడ్డి చెప్పారు.
వివరణ సంతృప్తికరంగా లేకుంటే వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందే
మాజీ సీఎం కేసీఆర్‌తో సహా నోటీసులు అందుకున్న 25 మంది ఇచ్చే సమాధానాలు సంతృప్తికరంగా లేకుంటే వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని కోరుతామని జస్టిస్నర్సింహారెడ్డి తెలిపారు. నోటీసులు అందుకున్న 25 మందిలో కేసీఆర్ ఒక్కరే పొలిటీషియన్ అని, మిగిలిన 24 మంది ఈ 3 అంశాలతో సంబంధం ఉన్న అధికారులేనని స్పష్టం చేశారు. నాటి థర్మల్ ప్లాంట్స్నిర్మాణం, విద్యుత్‌కొనుగోలు ఒప్పందాల్లో ఏ స్థాయిలో ఏమి జరిగిందనే వివరాలను తెలుసుకుంటున్నామని తెలిపారు. నోటీసులకు వారు ఇచ్చే సమాధానాలను బట్టి తదుపరి చర్యలుంటాయని జస్టిస్నర్సింహారెడ్డి స్పష్టం చేశారు.
ఇప్పటికే చాలా మంది నుంచి వివరణలు వచ్చాయి. విద్యుత్ సంస్థల మాజీ సీఎండీలు, ప్రస్తుత సీఎండీని కూడా విచారించాం. సోమవారం ట్రాన్స్‌కో, జెన్కో మాజీ సీఎండీ ప్రభాకర్ రావు, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ చందాను విచారించాం. అప్పటి ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎస్కే జోషి, అర్వింద్ కుమార్‌తో మంగళవారం సమావేశమయ్యాం. అందరి నుంచి వివరాలు తీసుకున్నాం.
- జస్టిస్ నర్సింహారెడ్డి