
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ పత్రిక మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ మాజీ చీఫ్ లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర నిందితులకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. సోనియా, రాహుల్ తోపాటు ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతరులు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. ఈ కేసు చార్జిషీట్ లో లోపాలను సరి చేశారని, బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 223 కింద నోటీసు ఇవ్వవచ్చా లేదా? అన్నదే ప్రస్తుత అంశమని పేర్కొంది.
చార్జిషీట్ లో పేర్లు ఉన్నవారు తదుపరి విచారణలో చార్జిషీట్ ను సవాల్ చేస్తూ వాదనలు వినిపించవచ్చని చెప్పింది. అనంతరం కేసు తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేసిన చార్జిషీట్ లో సరైన వివరాలు లేని కారణంగా ఈ కేసులో సోనియా, రాహుల్ కు నోటీసులు ఇచ్చేందుకు గత వారం కోర్టు నిరాకరించింది. తాజాగా చార్జిషీట్ లో లోపాలను సవరించినందున నోటీసులు జారీ చేస్తున్నట్టు స్పష్టం చేసింది.