తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని తిరుపతి శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. సంస్కృతం, తెలుగు, హిందీ, టూరిజం కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. భారతీయ సంస్కృతి, సాహిత్యం, భాషా వైభవాన్ని అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఇది మంచి అవకాశమని కళాశాల యాజమాన్యం తెలిపింది.
బి.ఏ. (ఓ.ఎల్.) డిగ్రీ కోర్సులో తెలుగు, సంస్కృతం, హిందీ, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్ విభాగాలలో ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాలు పొందవచ్చునని పేర్కొంది. అలాగే ప్రీ-డిగ్రీ (ఇంటర్‌మీడియట్‌కు సమానం) కోర్సులో సంస్కృతం, తెలుగు, హిందీ విభాగాలలో కూడా అడ్మిషన్లు జరుగుతున్నట్లు తెలిపారు.
- ఉచిత హాస్టల్, భోజన సదుపాయాలు:
ప్రవేశం పొందిన విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా ఉచిత హాస్టల్ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఉచిత భోజన వసతి కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
- అర్హతలు:
రెండేళ్ల ప్రీ-డిగ్రీ కోర్సులకు 18 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, ఎస్‌ఎస్‌సీ లేదా దానికి సమాన విద్యార్హత కలిగిన విద్యార్థులు అర్హులు.
మూడేళ్ల డిగ్రీ కోర్సులకు 21 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, ప్రీ-డిగ్రీ, ఇంటర్‌మీడియట్ లేదా సమాన విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.
- అప్లికేషన్ చివరి తేది:
జూన్ 17, 2026 నుంచి కళాశాలలో నేరుగా ప్రవేశాలు పొందవచ్చు. కె.టి. రోడ్డులోని ఎస్వీ ప్రాచ్య కళాశాల కార్యాలయంలో రూ.25 చెల్లించి అప్లికేషన్ ఫామ్స్ పొందవచ్చు. అప్లికేషన్లను జూలై 31, 2026 లోపు సమర్పించాలి.
మరిన్ని వివరాలకు 9848642346, 6281894208 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించవచ్చని కళాశాల అధికారులు తెలిపారు.
