
వరంగల్‌సిటీ, వెలుగు: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాలకు ఈ నెల 26 నుంచి 28 వరకు వెబ్ ఆప్షన్లకు కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ ఆఫీసర్లు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. యూనివర్సిటీ గుర్తింపు పొందిన ప్రైవేట్ మైనార్టీ, నాన్‌మైనార్టీ మెడికల్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా బీ, సీ( ఎన్ఆర్ఐ ) క్యాటగిరీ సీట్ల భర్తీకి ఆన్‌లైన్ కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి ఇప్పటికే మెరిట్ లిస్ట్‌ను యూనివర్సిటీ వెబ్ సైట్ లో పొందుపరిచారు. అర్హులైన అభ్యర్థులు కళాశాల వారీగా ఈ నెల 26 ఉదయం 6 గంటల నుంచి 28వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. అభ్యర్థులు కళాశాల వారీగా సీట్ల వివరాలను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. మరింత సమాచారానికి www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చని యూనివర్సిటీ ఆఫీసర్లు ఒక ప్రకటనలో తెలిపారు.