ఆర్టీసీలో మరో 70 అద్దె బస్సులకు నోటిఫికేషన్

ఆర్టీసీలో మరో 70 అద్దె బస్సులకు నోటిఫికేషన్
  • నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ
  • ఇప్పటికే 3 వేల అద్దె బస్సులు 
  • కొత్త బస్సుల కొనుగోలుకు సాయం చేయని సర్కార్ 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఆర్టీసీలోకి మరిన్ని అద్దె బస్సులు రానున్నాయి. కొత్తగా 70 ఎక్స్​ప్రెస్​ బస్సుల కోసం ఆర్టీసీ నోటిఫికేషన్ ఇచ్చింది. రూట్లు సహా పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ బుధవారం నుంచి ఆర్టీసీ వెబ్ సైట్ లో అందుబాటులోకి రానుంది. ఈ బస్సుల్లో హైదరాబాద్‌‌‌‌ జోన్‌‌‌‌లో 40, కరీంనగర్‌‌‌‌ జోన్‌‌‌‌లో 30 ఉన్నాయి. అద్దె బస్సులు నడిపేందుకు అప్లై చేసుకునేటోళ్లు  రిజిస్ట్రేషన్‌‌‌‌ ఫీజు రూ.2,500 (నాన్‌‌‌‌ రిఫండబుల్‌‌‌‌), కాషన్‌‌‌‌ డిపాజిట్‌‌‌‌ రూ.60 వేలు (రిఫండబుల్‌‌‌‌) చెల్లించి డీడీలు తీయాల్సి ఉంటుంది. ఒక్క రూట్​లో ఒక్కటి కంటే ఎక్కువ అప్లికేషన్లు వస్తే లక్కీ డ్రా పద్ధతిలో ఎంపిక చేయనున్నారు. అద్దె బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అర్హులు కాదని.. బస్సుల టెండర్లను ఎప్పుడైనా రద్దు చేసే హక్కు ఆర్టీసీకి ఉంటుందని నోటిఫికేషన్‌‌‌‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో 9 వేల బస్సులు ఉండగా.. వాటిలో 3 వేలకు పైగా అద్దె బస్సులే ఉన్నాయి. కాగా, పాత అద్దె బస్సుల గడువు ముగియడంతోనే కొత్తవి తీసుకుంటున్నామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. కొత్త బస్సుల కొనుగోలుకు సర్కార్ నుంచి సాయం అందకపోవడంతోనే అద్దె బస్సులు తీసుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. 
వజ్ర బస్సులు మూలకు.. 
సీఎం కేసీఆర్‌‌‌‌ నిర్ణయం మేరకు ఆర్టీసీలోకి 2017 మేలో 100 వజ్ర బస్సులను తెచ్చారు. వీటిలో అనేక సౌలతులు ఉన్నాయి. ఒక్కో దానికి రూ.25 లక్షల చొప్పున రూ.250 కోట్లతో 100 బస్సులు కొన్నారు. ఏసీ, ఎల్‌‌‌‌సీడీ టీవీ విత్‌‌‌‌ హైక్లాస్‌‌‌‌ ఆడియో సిస్టమ్‌‌‌‌, ఎయిర్‌‌‌‌ సస్పెన్షన్‌‌‌‌ ఫెసిలిటీ, ఇండివిడ్యువల్‌‌‌‌ ఏసీ అడ్జస్ట్‌‌‌‌మెంట్, వాటర్‌‌‌‌ బాటిల్స్‌‌‌‌, జీపీఎస్‌‌‌‌తో కూడిన ఫిట్టెడ్‌‌‌‌ ట్యాబ్‌‌‌‌ తదితర సదుపాయాలు ఉన్నాయి. ఈ బస్సులు కాలనీలకే వెళ్లి ప్రయాణికులను ఎక్కించుకునేవి. కానీ వీటికి పెద్దగా ఆదరణ రాకపోవడంతో నష్టాలు వచ్చాయి. దీంతో వీటన్నింటినీ రెండేండ్లుగా మూలనపడేశారు. ఏ విధంగానూ ఉపయోగించుకోవడం లేదు. ఇందులో కొన్నింటిని అమ్మాలని ప్రతిపాదించినా, అదీ ముందుకు కదలడం లేదని తెలిసింది. 
కొన్నవి 1,826 మాత్రమే.. 
తెలంగాణ ఆర్టీసీలో గతంలో దాదాపు 12 వేల బస్సులు ఉండేవి. కాలం చెల్లాయని 2014 నుంచి ఇప్పటి వరకు 4,991 బస్సులను తొలగించారు. పక్కన పెట్టాల్సినవి మరో 1,200 వరకు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. అయితే గత ఐదేండ్లలో టీఎస్‌‌‌‌ ఆర్టీసీ 1,826 బస్సులను మాత్రమే కొనుగోలు చేసింది. పాత బస్సులను అమ్మగా వచ్చిన డబ్బులతోనే ఎక్కువ శాతం కొత్తవి కొన్నది. 
కొత్త అద్దె బస్సులు ఇట్ల... 
రీజియన్‌‌‌‌    బస్సులు
మెదక్‌‌‌‌     2
నల్గొండ     21 
రంగారెడ్డి     17 
ఆదిలాబాద్‌‌‌‌     6 
ఖమ్మం     14
నిజామాబాద్‌‌‌‌   4
వరంగల్‌‌‌‌      6 
మొత్తం    70