ఫ్రెంచ్ ఓపెన్ లో జకోవిచ్ బోణి

ఫ్రెంచ్ ఓపెన్ లో జకోవిచ్ బోణి

పారిస్‌‌‌‌: సెర్బియా టెన్నిస్‌‌‌‌ లెజెండ్‌‌‌‌ నొవాక్‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌.. ఫ్రెంచ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో బోణీ చేశాడు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌లో జోకో 5–7, 7–5, 6–1, 6–4తో జియోవానీ మెట్షి పెరికార్డ్ (ఫ్రాన్స్‌‌‌‌)పై గెలిచాడు. తన కెరీర్‌‌‌‌లో రికార్డు స్థాయిలో 82వ గ్రాండ్‌‌‌‌స్లామ్‌‌‌‌ ఆడుతున్న సెర్బియన్‌‌‌‌.. ఈ మ్యాచ్‌‌‌‌ ద్వారా ఫెడరర్‌‌‌‌, ఫెలిసియానో లోపెజ్‌‌‌‌ పేరిటి ఉన్న అత్యధిక గ్రాండ్‌‌‌‌స్లామ్‌‌‌‌ టోర్నీల రికార్డును అధిగమించాడు. అలాగే ఫ్రెంచ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో 22వ సారి బరిలోకి దిగి రిచర్డ్‌‌‌‌ గాస్కే, అంటోనియిన్‌‌‌‌ జెంటియన్‌‌‌‌ రికార్డును సమం చేశాడు. ఇక పెరికార్డ్‌‌‌‌తో 2 గంటలా 51 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో జొకోవిచ్‌‌‌‌ తొలి సెట్‌‌‌‌ కోల్పోయినా అద్భుతంగా పుంజుకున్నాడు. 

రెండో సెట్‌‌‌‌లోనూ 10వ ప్రయత్నంలో ప్రత్యర్థి సర్వీస్‌‌‌‌ను బ్రేక్‌‌‌‌ చేసి ఆధిక్యంలో నిలిచాడు. ఇక మూడో సెట్‌‌‌‌ నుంచి తన ట్రేడ్‌‌‌‌ మార్క్‌‌‌‌ షాట్లతో రెచ్చిపోయాడు. డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ కార్లోస్‌‌‌‌ అల్కరాజ్‌‌‌‌ ఈ టోర్నీకి దూరం కావడంతో ఈసారి టైటిల్‌‌‌‌ నెగ్గేందుకు జొకోకు మంచి అవకాశం ఉంది. 

ఇతర మ్యాచ్‌‌‌‌ల్లో డి మాన్యుయెర్‌‌‌‌ (ఆస్ట్రేలియా) 6–4, 6–4, 6–2తో సామ్యూల్‌‌‌‌ (అమెరికా)పై, తియాఫో (అమెరికా) 6–3, 6–7 (5/7), 6–4, 6–3తో స్పిజ్జిరి (అమెరికా)పై గెలవగా, వావ్రింకా (స్విట్జర్లాండ్​) 3–6, 6–3, 3–6, 4–6తో డీ జోంగ్​ (నెదర్లాండ్స్​) చేతిలో ఓడాడు. విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌లో ఇగా స్వైటెక్‌‌‌‌ 6–1, 6–2తో ఎమర్సన్‌‌‌‌ జోన్స్‌‌‌‌ (ఆస్ట్రేలియా)పై, రిబకినా (కజకిస్తాన్‌‌‌‌) 6–2, 6–2తో వెరోనికా ఎర్జావెక్‌‌‌‌ (స్లోవేనియా)పై, స్వితోలినా (ఉక్రెయిన్‌‌‌‌) 3–6, 6–1, 7–6 (10/3)తో బోండర్‌‌‌‌ (హంగేరి)పై, పౌలిని (ఇటలీ) 7–5, 6–3తో డయానా యస్ట్రమస్కా (ఉక్రెయిన్‌‌‌‌)పై నెగ్గి రెండో రౌండ్‌‌‌‌లోకి ప్రవేశించారు. 

టేలర్‌‌‌‌ ఫ్రిట్జ్‌‌‌‌ కు తెలుగోడి షాక్‌‌‌‌

వైల్డ్‌‌‌‌ కార్డ్‌‌‌‌ ఎంట్రీతో బరిలోకి దిగిన భారత సంతతికి చెందిన యూఎస్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ నిశేష్‌‌‌‌ బసవరెడ్డి టోర్నీలో తొలి రోజే సంచలనం సృష్టించాడు. తొలి రౌండ్‌‌‌‌లో నిశేష్‌‌‌‌ 7–6 (7/5), 7–6 (7/5), 6–7 (9/11), 6–1తో వరల్డ్‌‌‌‌ తొమ్మిదో ర్యాంకర్‌‌‌‌ టేలర్‌‌‌‌ ఫ్రిట్జ్‌‌‌‌పై గెలిచాడు. 2 గంటలా 45 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో నిశేష్‌‌‌‌ బలమైన సర్వీస్‌‌‌‌లతో చెలరేగాడు. ఈ విజయంతో రోలాండ్ గారోస్లో టాప్–10 ఆటగాడిని ఓడించిన తొలి అమెరికా ఆటగాడిగా నిశేష్ రికార్డు సృష్టించాడు. 

2000 సంవత్సరంలో జాన్-మైఖేల్ గాంబిల్ అప్పటి ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ నికోలస్ కీఫర్‌‌‌‌ను ఓడించిన తర్వాత మళ్లీ ఆ రికార్డును నిశేష్ మాత్రమే సాధించాడు. నిశేష్‌‌‌‌ తల్లిదండ్రులు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన వారు కావడం గమనార్హం.