ప్రాజెక్టుల కాలువల రిపేర్లకు ఉపాధి నిధులే

ప్రాజెక్టుల కాలువల రిపేర్లకు ఉపాధి నిధులే

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఉపాధి హామీ నిధులతోనే మన ప్రాజెక్టుల కాలువలు పారనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో చేసిన కేటాయింపుల కన్నా ఉపాధి హామీ నిధులనే పెద్ద ఎత్తున ఖర్చు చేసి రైతుల పొలాలకు నీళ్లు ఇచ్చే పనులు చేయిస్తోంది. రూ.1,200 కోట్ల అంచనాతో ఇప్పటికే పనులు మొదలు పెట్టింది. డిస్ట్రిబ్యూటరీల్లో పిచ్చిమొక్కల తొలగింపు, పూడికతీత, కాలువ కట్టల బలోపేతం పనులు చేపట్టింది. ఉత్తర తెలంగాణకు వర ప్రదాయినీగా చెప్పుకునే ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు బడ్జెట్ లో చేసిన కేటాయింపుల కన్నా తొమ్మిది రెట్లు అదనంగా ఉపాధి డబ్బులను రాష్ట్ర సర్కారు అక్కడ కాలువల రిపేర్లకు ఉపయోగిస్తోంది. చెరువులు, కుంటల కింద పారకానికీ ఈ పైసలే కీలకంగా మారాయి. కూలీలతో చేపట్టే ఈ పనుల ఖర్చులో 90 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తే.. రాష్ట్ర సర్కారు పది శాతమే ఖర్చు చేయనుంది. రాష్ట్రంలోని 17 ప్రాజెక్టుల డిస్ట్రిబ్యూలరీలు, ఫీడర్ చానళ్లలో పూడిక తొలగింపు, రైతుల పొలాలకు నీళ్లు ఇచ్చేలా కొత్త కాల్వల తవ్వకం, ప్రాజెక్టుల కాలువల నుంచి చెరువులకు నీళ్లు ఇచ్చే కాలువల పనులను రూ.700 కోట్లతో.. కృష్ణా, గోదావరి బేసిన్ లోని 30 వేల చెరువుల పంట కాలువల రిపేర్లకు రూ.500 కోట్లతో చేపట్టేందుకు ఇరిగేషన్ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ఆయా పనులకు రాష్ట్ర బడ్జెట్ లో పెద్దగా కేటాయింపులు చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఉపాధి హామీ నిధులతో ఈ పనులు చేపట్టాలని నిర్ణయించింది.

మైనర్ ఇరిగేషన్ కూ..

కృష్ణా, గోదావరి బేసిన్ ల పరిధిలో మైనర్ ఇరిగేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో రూ. 406.66 కోట్లను కేటాయించగా.. అంతకన్నా ఎక్కువ నిధులనే ఇప్పుడు ఉపాధి హామీలో ఖర్చు చేయనున్నారు. 30 వేల చెరువుల కాలువల రిపేర్లకు రూ.498 కోట్లు కేటాయించారు. ఈ మొత్తంతో 2,025 చదరపు మీటర్ల జంగిల్ కట్టింగ్ పనులు చేస్తారు. ఇందుకు రూ. 300 కోట్లు ఖర్చు చేస్తారు. 1.42 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక తొలగింపు పనులను రూ.198 కోట్లతో చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పనులు పూర్తయ్యాక అదనపు పనులు చేసినా కేంద్రం నుంచి నిధులు వచ్చే చాన్స్​ ఉండటంతో ఉపాధి హామీ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తున్నారు.

మిగతా ప్రాజెక్టులకూ..

ఇవే కాకుండా ఉపాధి హామీ నిధుల కింద ఇతర ప్రాజెక్టుల్లోనూ కాలువలు, డిస్ట్రిబ్యూటరీల పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. అందులో ఎస్సారెస్పీ స్టేజ్ ‌‌‌‌– 2కు రూ.36.71 కోట్లు, నాగార్జున సాగర్, ఏఎమ్మార్పీకి రూ.12.62 కోట్లు, నిజాం సాగర్​కు రూ.1.51 కోట్లు, సింగూరుకు రూ.4.30 కోట్లు, ఘన్ పూర్ ఆనికట్ కు రూ.3.73 కోట్లు, వట్టివాగుకు రూ.6.92 కోట్లు, కోయిల్ సాగర్ కు రూ. 2.65 కోట్లు, గడ్డెన్నవాగుకు రూ. 1.87 కోట్లు, శనిగరం ప్రాజెక్టుకు రూ.91.94 లక్షలు, రాలీవాగుకు రూ.64.18 లక్షలు, గొల్లవాగుకు రూ.31.5 లక్షలు, మత్తడివాగుకు రూ.13.66 లక్షలు, సాత్నాల ప్రాజెక్టుకు రూ.6.4 లక్షలు, రామడుగుకు రూ.26.32 లక్షలు, నల్లవాగు ప్రాజెక్టు కాల్వల పనులకు రూ.7.14 లక్షలు కేటాయించింది.

ఎస్సారెస్పీకి ఇట్ల..!

14 లక్షల ఎకరాలకు పైగా నీళ్లు ఇచ్చే ఎస్సారెస్పీ డిస్ట్రిబ్యూటరీల పునరుద్ధరణకు భారీగా ఉపాధి హామీ నిధులను వాడుకోవాలని ఎస్టిమేట్స్ ఇచ్చారు. ఆయా పనులు కూడా ఇప్పటికే మొదలు పెట్టారు. ఎస్సారెస్పీ మెయిన్ కెనాల్ లో 41.76 లక్షల స్క్వేర్ మీటర్లు, బ్రాంచి కాలువల్లో 92.40 లక్షల చదరపు మీటర్లు, సబ్ మైనర్ లో 1.10 కోట్ల చదరపు మీటర్లు, ఫీడర్ చానల్స్ లో 32.40 లక్షల చదరపు మీటర్ల జంగిల్ క్లియరెన్స్ పనులు ఉపాధి హామీ నిధులతో చేపడుతున్నారు. మొత్తంగా అన్ని కాలువల్లో కలిపి 55.74 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక తొలగించనున్నారు. కొత్తగా 32.40 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించి ఫీడర్ చానళ్లు తవ్వనున్నారు. కాలువల సరిహద్దుల వెంట స్ట్రెంచ్ కొట్టడం, ఇతర పనులు చేపట్టేందుకు ఈ నిధులను వాడనున్నారు. 2020–21 వార్షిక బడ్జెట్ లో ఎస్సారెస్పీకి ప్రభుత్వం కేవలం రూ. 25.52 కోట్లను కేటాయించింది. ఉపాధి హామీ నిధులతోనే మొత్తం డిస్ట్రిబ్యూటరీల పనులను చేపడుతున్నారు.

దేవాదుల కింద అన్నీ కొత్త పనులే

దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద కొత్త పనులు చేపట్టేందుకు రూ.159.71 కోట్లు కేటాయించారు. 20.35 లక్షల చదరపు మీటర్ల ఫీడర్ చానళ్ల తవ్వకానికి రూ.65 కోట్లు కేటాయించారు. బ్రాంచ్ కెనాళ్లు, సబ్ మైనర్ల వెంట స్ట్రెంచ్ కొట్టడం, కాలువ కట్టలు తెగిపోకుండా రెండు వైపులా డ్రైనేజీ కాలువలు తవ్వకానికి ఇంకో రూ.94.53 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే నీరందిస్తున్న కాలువల మరమ్మతులకు మిగతా మొత్తాన్ని వెచ్చిస్తారు.