పరిహారం ఇయ్యండి లేదా..  బాంబులేసి సంపండి

పరిహారం ఇయ్యండి లేదా..  బాంబులేసి సంపండి
  • సర్కారుపై నృసింహ రిజర్వాయర్‌‌ నిర్వాసితుల మండిపాటు  
  • జాతీయ బీసీ కమిషన్‌‌ ముందు గోడు
  • పరిహారం తగ్గిస్తామంటున్నారని ఆవేదన
  • ఒక్క ఊర్లో రెండు రకాల పరిహారాలెలా ఇస్తారు?: కమిషన్‌‌ మెంబర్‌‌ ఆచారి
  • విచారణకు కలెక్టర్‌‌ రాకపోవడంపై సీరియస్‌‌ 

యాదాద్రి, వెలుగు: ‘పరిహారం ఇస్తమంటరు.. ఇయ్యమంటరు.. తగ్గిస్తరు. ఒక్కో ఆఫీసర్ ఒక్కోలా చెప్తడు. రిజర్వాయర్‌‌ కింద ఊరు మునిగిపోతదని పిల్లనివ్వడానికి వస్తలేరు. మా ఊర్ల పిల్లను చేసుకోవట్లేదు. నిద్ర పట్టట్లేదు. గుండెలు ఆగుతున్నయ్‌‌. ఉండాలా.. సావాలా..? రోజూ ఈ బాధలు పడలేము.. ఒక్కసారి మా ఊరిపై బాంబులేసి సంపండి’ అని జాతీయ బీసీ కమిషన్ ఎదుట ‘నృసింహ’ రిజర్వాయర్ నిర్వాసితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. యాదాద్రి జిల్లా బస్వాపురంలో కాళేశ్వరం 16వ ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న నృసింహ రిజర్వాయర్ భూ సేకరణలో తమకు అన్యాయం జరుగుతోందని బీఎన్ తిమ్మాపూర్ ప్రజలు కమిషన్‌‌ను ఆశ్రయించారు. దీంతో కమిషన్ మెంబర్‌‌ టీ ఆచారి సోమవారం ఊర్లో విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఊరి ప్రజలు మాట్లాడుతూ.. ‘రిజర్వాయర్ కోసం ఊరితో బంధాన్ని తెంచుకోవడానికి సిద్ధమైనా సర్కారు మాకు న్యాయం చేయట్లేదు. గతంలో  కాన్సెంటివ్ అవార్డు కింద ఎకరాకు రూ. 15.60 లక్షలు పరిహారం ఇస్తామన్నరు. ఇప్పుడేమో జనరల్‌‌ అవార్డు కింద రూ. 12.47 లక్షలే ఇస్తామని ఆఫీసర్లు అంటున్నరు. ఈ మధ్య భూముల విలువ పెంపుతో తమకు గతంలో చెల్లించిన డబ్బు కంటే ఎక్కువే వస్తాయి. ఏండ్లు గడుస్తున్నా పరిహారం పెంచాల్సింది పోయి తగ్గిస్తారా?’ అని అడిగారు. 

ప్రజలు కావాల్సినవి కొట్లాడి తీసుకోండి: ఆచారి
ఒక్క ఊరిలో రెండురకాల అవార్డులెలా ఇస్తారని అధికారులను ఆచారి ప్రశ్నించారు. రిజర్వాయర్ నిర్వాసితులకు కాన్సెంటివ్ అవార్డు జారీ చేయాలని, మూడు నెలల్లో పరిహారం ఇవ్వాలని అన్నారు. కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి పైసలున్నప్పుడు రైతులకు ఇవ్వడానికి లేటెందుకవుతోందని ప్రశ్నించారు. భూముల విలువ పెరిగింది కాబట్టి గతంలో ఇచ్చిన కాన్పెంటివ్ అవార్డ్ కన్నా ఎక్కువ రేటు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. విచారణకు కలెక్టర్‌‌ రాకపోవడంపై ఆచారి సీరియస్‌‌ అయ్యారు. ప్రభుత్వాలు భూమి గుంజుకునేందుకు ప్రయత్నిస్తే బీసీ కమిషన్ రైతుల పక్షాన పని చేస్తుందని తేల్చి చెప్పారు. ‘పౌతి సమస్యను అధికారులు వారంలో పరిష్కరించాలి. కొత్తగా ఇండ్లు కట్టుకుంటున్న వాళ్లకు నల్లా, మౌలిక సౌకర్యాలు కల్పించాలి’ అని ఆదేశించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. ప్రజలకు కావాల్సిన వాటిని కొట్లాడి తీసుకోండని, ధైర్యం కోల్పోవద్దని చెప్పారు. త్వరలో ఢిల్లీలో నిర్వహించే సమావేశానికి ఆఫీసర్లు హాజరు కావాలని సూచించారు. 

ఇంటికి కరెంట్‌‌, నల్లా కనెక్షన్‌‌ ఇస్తలేరు
కొద్దిరోజుల్లో పరిహారం వస్తుందంటూ.. పౌతి చేయమన్నా ఆఫీసర్లు చేయట్లేదని, దీంతో రైతులు చనిపోయినా బీమా వర్తించట్లేదని బీఎన్‌‌ తిమ్మాపూర్‌‌ ప్రజలు ఆవేదన చెందారు. మొదట్లో వడపర్తిలో ఇండ్ల స్థలాలు ఇస్తామన్నారని.. ఇప్పుడు హుస్సేనాబాద్‌‌లో ఇస్తామంటున్నారని చెప్పారు. తమకు ఎక్కడా ఇండ్లు కట్టించలేదని.. అందుకే ఊర్లో కొత్తగా ఇల్లు కట్టుకుంటే కరెంట్, నల్లా కనెక్షన్ ఇవ్వట్లేదని ఆవేదన చెందారు. ‘సర్కారు వేరే ఊర్లో కొత్తగా ఇండ్లు కట్టించేదాకా ఊర్లో కరెంట్, నీళ్లు లేకుండానే బతకాలా?’ అని ప్రశ్నించారు.