- వెబ్ సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని ఎన్టీఏ సూచన
హైదరాబాద్, వెలుగు: వైద్య విద్య కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే నీట్ (యూజీ)-2026 రీ-ఎగ్జామ్‌కు సంబంధించిన ఎగ్జామినేషన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆదివారం విడుదల చేసింది. ఈ నెల 21న జరగనున్న రీ-ఎగ్జామ్‌కు హాజరయ్యే విద్యార్థులు తమ పరీక్ష ఏ సిటీలో ఉందో అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. గత నెల మే 15న వెలువరించిన ఎన్టీఏ తెలిపిన ప్రకారం, అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో వెబ్‌సైట్‌లోకి వెళ్లి సిటీ స్లిప్పును డౌన్‌లోడ్ చేసుకోవాలి. దేశవ్యాప్తంగా 551 నగరాల్లో, విదేశాల్లోని 14 ప్రధాన నగరాల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు.
ప్రస్తుతం విడుదల చేసిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పు కేవలం పరీక్ష జరిగే నగర వివరాలు మాత్రమే చూపిస్తుందని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఇది అడ్మిట్‌కార్డు (హాల్‌టికెట్) కాదని తెలిపింది. విద్యార్థులు ప్రయాణ ఏర్పాట్లు ముందుగానే చేసుకునేందుకు ఈ సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. పరీక్షకు కొద్ది రోజుల ముందు పూర్తి వివరాలతో అడ్మిట్ కార్డులను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే ఎన్టీఏ హెల్ప్‌లైన్ నంబర్లు 011-40759000, 011-69227700లకు ఫోన్ చేయవచ్చు. అలాగే neetug2026@nta.ac.inకు ఈ-మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు
