7 నుంచి 12 దాకా ఎన్టీఆర్​ మార్గ్​ క్లోజ్​

7 నుంచి 12 దాకా ఎన్టీఆర్​ మార్గ్​ క్లోజ్​
  • చూసేందుకు 21 వేల మంది వస్తారని అంచనా
  • 300 మంది పోలీసులు,  275 మంది ట్రాఫిక్ సిబ్బంది, అధికారులకు డ్యూటీలు
  • రేసింగ్​ పనులను  పరిశీలించిన సీపీ

 ఖైరతాబాద్/శంషాబాద్​, వెలుగు: ఫార్ములా– ఈ రేసింగ్​కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని,  రేసింగ్ టైంలో ఉండే ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు సహకరించాలని హైదరాబాద్​ సీపీ సీవీ ఆనంద్ అన్నారు.  హైదరాబాద్​లోని  ట్యాంక్ బండ్ పై ఈ  నెల 11, 12 తేదీల్లో ఫార్ములా – ఈ రేసింగ్  జరుగుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం ఆయన పరశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘ట్రాక్ పై చాలా పనులు ఉన్నాయని నిర్వాహకులు చెప్పారు. కాబట్టి ఈ నెల 5న ఎన్టీఆర్​ మార్గ్​ పూర్తిగా క్లోజ్ చేస్తం. ఆ మరుసటిరోజు అంటే 6న అసెంబ్లీలో బడ్జెట్​ ఉంటున్నందున  ఆ రోజు మాత్రం  ఓపెన్​ చేస్తం. తిరిగి 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఎన్‌‌‌‌‌‌‌‌టీఆర్‌‌‌‌‌‌‌‌ మార్గ్ పూర్తిగా క్లోజ్ ఉంటుంది. ఈ డైవర్షన్​ను గుర్తు పెట్టుకొని వాహనదారులు ప్రత్యామ్నాయ దారులలో వెళ్లాలి” అని కోరారు. ఖైరతాబాద్, తెలుగు తల్లి ఫ్లైఓవర్లు కూడా మూసి వేస్తామని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో   మన నగరంలో రేసింగ్ లీగ్  నిర్వహించబోతున్నారని, దీనికంటే ముందు ఇండియన్ రేసింగ్ లీగ్ పేరుతో ప్రాక్టీస్​లు డిసెంబర్ నెలలో రెండు సార్లు చేశారని చెప్పారు. అప్పుడు జరిగిన తప్పులను ఇప్పుడు సవరించుకొని అంతర్జాతీయ స్థాయిలో ఫార్ములా – ఈ రేసింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శుక్రవారం నుంచి అసెంబ్లీ కొనసాగబోతుందని, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈ నెల 17న సెక్రటేరియెట్ ప్రారంభోత్సవం కూడా ఉందని, ఆ నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని  సీవీ ఆనంద్​ చెప్పారు. ఫార్ములా– ఈ రేస్​ ఉన్నా సెక్రటేరియెట్ పనులు యథావిధిగా కొనసాగుతున్నాయని అన్నారు. 

ఎయిర్ పోర్టుకు చేరుకున్న విడిభాగాలు

ఫార్ములా – ఈ  రేసింగ్ కార్ల విడిభాగాలు శంషాబాద్ ఎయిర్ పోర్టులో కార్గో విభాగానికి చేరుకున్నాయి. రియాద్ నుంచి బోయింగ్ చార్టర్ ఫ్లైట్ ద్వారా కార్ల 90 టన్నుల విడిభాగాలు బుధవారం రాత్రి 11.50 గంటలకు  శంషాబాద్ ఎయిర్ కార్గో టెర్మినల్‌‌‌‌‌‌‌‌కు వచ్చాయి. మరో రెండు విమానాలలో మిగతా రేసింగ్ కార్ల విడి భాగాలు చేరుకోనున్నాయి. 

21 వేల మంది ప్రేక్షకులు

ఫార్ములా –ఈ రేసింగ్​ను చూడటానికి 21 వేల మంది వస్తారని, వారిని దృష్టిలో ఉంచుకుని 11 స్టాండ్లు,  7 గేట్లు, నాలుగు ఫుట్ ఓవర్  బ్రిడ్జిలతోపాటు  పార్కింగ్ కోసం 16 ప్రాంతాలు సిద్ధం చేశామని సీపీ చెప్పారు. 300 మంది లాండ్ ఆర్డర్ పోలీసులు,  275 మంది ట్రాఫిక్ సిబ్బంది, అధికారులు విధులు నిర్వహిస్తారని తెలిపారు.