
- జనవరి 1న ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్
- కరోనా నేపథ్యంలో జాగ్రత్త తీసుకుంటామంటున్న సొసైటీ సభ్యులు
- ఈసారి స్పెషల్ అట్రాక్షన్గాఫిష్ అక్వేరియం
- 60 ఫీట్ల వెడల్పు, 40 ఫీట్ల ఎత్తుతో ఏర్పాటు చేస్తున్న సొసైటీ
హైదరాబాద్, వెలుగు : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే నుమాయిష్ కోసం పనులు కొనసాగుతున్నాయి. వచ్చే నెల జనవరి 1 నుంచి ఫిబ్రవరి15 వరకు నుమాయిష్ ఎగ్జిబిషన్ జరగనుంది. 83వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నిర్వహణకు సంబంధించి నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నుమాయిష్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్నట్లు సోసైటీ సభ్యులు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్‌కి మొత్తం 25 లక్షల మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారులను ఆహ్వానించే ప్రక్రియను పూర్తి చేసిన సొసైటీ స్టాల్స్ నిర్మాణాన్ని ప్రారంభించింది.
నుమాయిష్ ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ. 20 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఈ సారి 2,400 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఇప్పటికే అన్ని స్టాల్స్ నిర్వాహకులకు అప్పగించారు. అయితే మార్పుల కారణంగా 5 నుంచి 10 శాతం స్టాల్స్ ఇంకా అప్పగించే పనులు జరుగుతున్నాయి. దాదాపు 90 శాతం పనులు పూర్తికాగా.. మరికొన్ని నిర్మాణ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
గతేడాదికి భిన్నంగా స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు మైదానంలో లే -అవుట్ పనులు తీర్చిదిద్దుతున్నారు. ఎగ్జిబిషన్ ప్రవేశ ద్వారాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఎంట్రీ ఫీజు రూ.40 లుగా నిర్ణయించారు. సిటీ ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సహకారంతో ఖాళీ స్థలాన్ని పార్కింగ్ కోసం ఉచితంగా కల్పిస్తున్నారు. ఈసారి ఎగ్జిబిషన్లో ఫిష్ అక్వేరియం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. 60 ఫీట్ల వెడల్పు, 40 ఫీట్ల ఎత్తులో ఈ అక్వేరియాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు పాటించనున్నారు.
ఈసారి స్టాల్స్‌కు భారీ డిమాండ్
ఎగ్జిబిషన్ స్టాల్స్ కోసం ఈసారి చాలా డిమాండ్ ఏర్పడింది. 2,400 స్టాల్స్ ఉండగా.. 3,500 అప్లికేషన్లు వచ్చినట్లు సొసైటీ సభ్యులు తెలిపారు. ఇందులో సినీయార్టినీ బట్టి స్టాల్స్‌ను అప్పగించారు. ఎగ్జిబిషన్లో ప్రతిసారి ఏర్పాటు చేసే విధంగా కంప్లీట్ షాపింగ్‌తో పాటు ఫుడ్‌కోర్టు తదితర అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఫ్యాషన్, గార్మెంట్స్, టెక్స్ టైల్స్, హాండ్లూమ్స్, హ్యండీ క్రాఫ్ట్స్, హోమ్ నీడ్స్, జ్యూవెల్లరీ, బ్యూటీ, హెల్త్ కేర్, ఎలక్ట్రిక్
ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆటో మూవీస్, ఫుడ్ కోర్ట్తోపాటు తదితర వాటికి సంబంధించి స్టాల్స్ ఏర్పాటు కానున్నాయి. పిల్లల కోసం జాయ్ రైడ్స్ అందుబాటులో ఉండనున్నాయి. వృద్ధులు, నడవలేని వారికి ఎగ్జిబిషన్ లోపల ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు వాహనాలతో సందర్శించే అవకాశం కల్పిస్తున్నారు.
ప్రత్యేక బస్సులు, మెట్రో రైళ్లు..
నుమాయిష్‌ను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ పలు డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడపనుంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు నాంపల్లి, గాంధీభవన్ మెట్రో స్టేషన్లు సమీపంలో ఉన్నాయి. రద్దీని దృష్టిలో పెట్టుకొని సందర్శకులు ఎక్కడైనా మెట్రో దిగవచ్చు. మియాపూర్,- ఎల్బీగర్, నాగోల్, రాయదుర్గం మార్గాల్లో నడిచే మెట్రో రైళ్లను నుమాయిష్‌ను దృష్టిలో ఉంచుకుని అర్ధరాత్రి వరకు నడిపే అవకాశం ఉంది.
40 ఏళ్లుగా వస్తున్న....
కశ్మీర్ నుంచి 40 ఏళ్లుగాఈ ఎగ్జిబిషన్‌కు వస్తున్న. లెదర్‌కు సంబంధించిన అన్ని రకాల వస్తువుల బిజినెస్ చేస్త. ఈ సారి గ్రౌండ్లో మంచిగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన షెడ్లు బాగున్నాయి. నుమాయిష్ ఆసియాలోనే టాప్ ఎగ్జిబిషన్. ఈ సారి మంచి బిజినెస్ అవుతుందని అనుకుంటున్న.
– అష్రఫ్, స్టాల్ నిర్వాహకుడు
ఫస్ట్ టైం పెడుతున్న..
నాకు బంజారాహిల్స్‌లో మెన్స్ వేర్ ఉంది. ఫస్ట్ టైం ఎగ్జిబిషన్లో స్టాల్ తీసుకున్న. ఇక్కడ బిజినెస్ బాగా అవుతుందన్న నమ్మకంతోనే ఇక్కడకి వచ్చా. నుమాయిష్ ఎగ్జిబిషన్‌కు దేశంలోని చాలా ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఇక్కడే ఉండి నేనేందుకు బిజినెస్ చేయొద్దని అనుకొని ఈ సారి స్టాల్ తీసుకున్న.
– మనీష్, స్టాల్ నిర్వాహకుడు
అన్ని ఏర్పాట్లు చేశాం....
ఎగ్జిబిషన్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. స్టాల్స్ కోసం ఈసారి చాలా డిమాండ్ ఏర్పడింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారులు వచ్చారు. సందర్శకులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాం. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జాగ్రత్తలు తీసుకుంటాం.
– వనం సత్యేందర్, ఎగ్జిబిషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్