దేశంలో 43కు చేరిన కరోనా పేషెంట్లు: ముగ్గురు డిశ్చార్జ్

దేశంలో 43కు చేరిన కరోనా పేషెంట్లు: ముగ్గురు డిశ్చార్జ్

దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 43కు చేరింది. వారిలో కేరళకు చెందిన తొలి ముగ్గురు పేషెంట్లు పూర్తిగా నయమై.. డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన 40 మంది చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఒక్క రోజే నలుగురికి కరోనా

దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజీవ కుమార్ సోమవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. ఆదివారం వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 39గా ఉందన్నారు. ఒక్క రోజులో దేశంలో కొత్తగా నలుగురికి కరోనా సోకినట్లు తెలిపారు. కేరళలో మూడేళ్ల బాలుడితో సహా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జమ్ముల్లో ఒక్కొక్కరికి కరోనా వచ్చిందని చెప్పారు.

ఢిల్లీ పేషెంట్ ఇటలీ నుంచి వచ్చారని, అక్కడ వైరస్ సోకి ఉంటుందని అన్నారు సంజీవ కుమార్. యూపీ పేషెంట్‌కు ఇప్పటికే కరోనాతో ఆగ్రాలో చికిత్స పొందుతున్న ఐదుగురిని కొద్ది రోజుల క్రితం కలవడం వల్ల వారి నుంచి వైరస్ సోకిందని చెప్పారాయన. జమ్ము కశ్మీర్‌లో సోమవారం తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైందని, జమ్ముకు చెందిన మహిళ ఇరాన్ వెళ్లి వచ్చిందని, ఆమెకు కరోనా ఉన్నట్లు టెస్టుల్లో తేలిందని చెప్పారు. కేరళలోని ఎర్నాకుళానికి చెందిన మూడేళ్ల బాలుడు తన పేరెంట్స్‌తో కలిసి ఇటలీ వెళ్లి వచ్చారని, వైరస్ సోకినట్లు తేలడంతో ఎర్నాకుళం మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కేరళలో ఇప్పటి వరకు మొత్తం 9 మందికి కరోనా సోకిందని, వారిలో ముగ్గురు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు సంజీవ కుమార్.

ఆ ఐదుగురు పేషెంట్లు ఫంక్షన్లకు కూడా వెళ్లారు

వైరస్ వ్యాప్తి నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజవకుమార్. కేరళలోని పథనంతిట్టలో నిన్న ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా సోకినట్లు తేలిందని, అయితే వారు కొన్ని ఫంక్షన్లకు కూడా వెళ్లారని తెలిసిందని తెలిపారు. ఆయా ఫంక్షన్లకు హాజరైన వారందరినీ గుర్తించి స్క్రీనింగ్ చేస్తామన్నారు సంజీవకుమార్. దేశంలో పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పారు. రాష్ట్రాల మంత్రులతోనూ రోజూ మాట్లాడుతున్నారన్నారు. ప్రజలకు అవేర్‌నెస్ కల్పించేందుకు అన్ని టెలికామ్ కంపెనీల ఫోన్ యూజర్ల కాలర్ ట్యూన్‌గా కరోనా గురించి చెప్పేవిధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు సంజీవ్ కుమార్. అలాగే మెసేజ్‌లు కూడా పంపుతున్నామని, ఇప్పటి వరకు 117 కోట్ల మందికి అవి రీచ్ అయినట్లు చెప్పారు.