నలుగురి పని ఒక్క నర్సే చేస్తున్నరు

నలుగురి పని  ఒక్క నర్సే చేస్తున్నరు

రాష్ట్రంలో నర్సులపై పని భారం ఎక్కువవుతోంది. నలుగురి పని ఒక్కరే చేయాల్సి వస్తోంది. ఏటా పదుల సంఖ్యలో నర్సులు రిటైర్‌‌‌‌ అవుతున్నా భర్తీకి సర్కారు చర్యలు తీసుకోకపోవడంతో ఉన్న వాళ్లే పనిని నెట్టుకు రావాల్సి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 6 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉండటంతో ఊపిరి సలపకుండా పని చేయాల్సి వస్తోంది. రాష్ట్ర పర్యటనలో ఉన్న ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌‌‌‌ (ఐఎన్‌‌‌‌సీ) టీం అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

పెద్దాస్పత్రుల్లో వందల్లో ఖాళీలు

సర్కారు దవాఖానాల్లో నర్సుల కొరతపై ఐఎన్‌‌‌‌సీ దృష్టి పెట్టింది. ఇక్కడి పరిస్థితులు తెలుసుకోవడానికి ఓ బృందాన్ని పంపింది. మూడ్రోజుల క్రితం ఢిల్లీ నుంచి వచ్చిన ఇద్దరు ప్రతినిధుల బృందం హైదరాబాద్‌‌‌‌లోని సర్కారు దవాఖాన్లను సందర్శించి హాస్పిటళ్ల బెడ్లు, నర్సింగ్ స్ర్టెంత్‌‌‌‌పై వివరాలు సేకరించింది. ఈ సందర్భంగా నలుగురి పనిని ఒక్కరితోనే చేయిస్తున్నరని ఐఎన్‌‌‌‌సీ ప్రతినిధులకు నర్సులు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. నర్సింగ్ పోస్టులు భర్తీ చేయకపోవడం, పనిభారం మోపడంపై ఢిల్లీ బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. పరిస్థితులపై కేంద్రానికి నివేదించి చర్యలు తీసుకుంటామంది. నర్సుల పరిస్థితులపై కేంద్రానికి నివేదించేందుకు ట్రైన్డ్‌‌‌‌ నర్సెస్‌‌‌‌ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(టీఎన్‌‌‌‌ఏఐ) కూడా వివరాలు సేకరిస్తోంది. కనీస వేతనాల అమలుపై హైకోర్టుకు వెళ్లాలని టీఎన్‌‌‌‌ఏఐ ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం గాంధీ, ఉస్మానియా, నీలోఫర్‌‌‌‌‌‌‌‌ లాంటి పెద్ద దవాఖాన్లలో పరిస్థితి దారుణంగా ఉంది. ఒక్కో దవాఖానాలో వంద, రెండొందలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

భర్తీ చేయరా?

రాష్ట్రం వచ్చాక 6 నర్సు పోస్టులనే భర్తీ చేసినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. రెండేండ్ల క్రితం 3,300 పోస్టుల భర్తీకి సర్కారు నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే పరీక్షలో కాంట్రాక్టు ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వడంపై నిరుద్యోగులు కోర్టుకెళ్లారు. ఇది ఎటూ తెగక ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇదే సాకుగా మరో నోటిఫికేషన్‌‌‌‌ను ప్రభుత్వం ఇవ్వలేదు. సర్కారీ దవాఖానాల్లో ప్రస్తుతమున్న పడకలకు ఇంకో 12 నుంచి 14 వేల మంది నర్సులు అవసరం. కోర్టు పరిధిలో ఉన్న 3,330 పోస్టులను పక్కనబెట్టినా ఇంకో ఆరేడు వేల పోస్టుల భర్తీకి అవకాశం ఉంది. అయినా ఆ దిశగా ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రతి నెలా పదుల సంఖ్యలో నర్సులు రిటైర్‌‌‌‌‌‌‌‌ అవుతుండటంతో ఉన్న వాళ్లపైనే పని భారం ఎక్కవవుతోంది. ఈ ఎఫెక్ట్‌‌‌‌ రోగులపై పడుతోంది. రోగులు, వారి అటెండెంట్లపై నర్సులు రుసరుసలాడుతున్నారు. ఒక్కరమే ఎంత పనిచేస్తామని నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాత్కాలిక పోస్టులెవ్వి?

పని భారం ఎక్కువ అవుతుండటంతో పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వంపై నర్సింగ్ సంఘాలు ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో తాత్కాలికంగా కాంట్రాక్టు పద్ధతిలో 2 వేల మందిని తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. కానీ ఆర్నెళ్లవుతున్నా ఒక్కర్నీ నియమించలేదు. జగదీశ్ కమిటీ సూచన మేరకు నర్సింగ్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ను‌‌‌‌ ఏర్పాటు చేయాలని, స్టాఫ్ నర్స్ పేరును నర్సింగ్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా మార్చాలని, ప్రైవేటు హాస్పిటళ్లలో చేస్తున్న నర్సులకు కనీస వేతనాలు అమలు చేయాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. వీటిల్లో ఒక్కటీ అమలు కాకపోవడంపై ఐఎన్‌‌‌‌సీ ఆరా తీస్తోంది. మరోవైపు ప్రభుత్వ తీరుపై నర్సులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపోల్స్‌‌‌‌లో నోటాకు ఓటు వేయాలని నర్సింగ్ ఆఫీసర్స్‌‌‌‌ అసోసియేషన్
పిలుపునిచ్చింది.