
సాధారణంగా వాటర్ జగ్గు ధర ఎంతుంటుంది..50 రూపాయలు..కొంచెం క్వాలిటీది అయితే 100 రూపాయలు..అయితే ఒక్క వాటర్ జగ్గు ధర వేలల్లో ఉండగా మీరెప్పుడైనా చూశారా.. 32వేల 500 రూపాయలు..నమ్మలేకపోతున్నారా.. ఛత్తీస్ గఢ్ లో హాస్టళ్లలో జగ్గులు కొనేందుకు గిరిజన సంక్షేమ శాఖ చేసిన ఖర్చుల చిట్టా చూస్తే నిజమే అని అనిపించకపోదు.
ఇటీవల ఛత్తీస్ గఢ్ గిరిజన సంక్షేమ శాఖలో పెద్ద వివాదం నెలకొంది.. అదేంటంటే.. గిరిజన సంక్షేమ శాఖలో 160 వాటర్ జగ్గులకు రూ. 52 లక్షలు ఖర్చు పద్దు. ఛత్తీస్‌గఢ్‌లో 160 ప్లాస్టిక్ వాటర్ జగ్గుల కొనుగోలుకు రూ. 52 లక్షలు ఖర్చు చేశారనే ఆరోపణలు పెద్ద వివాదానికి దారితీశాయి.
ALSO READ : Ranya Rao Gold Smuggling: గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. కన్నడ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష
సాధారణంగా ప్లాస్టిక్ జగ్గుల ధర చాలా తక్కువగా ఉంటుందని, ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం అవినీతికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ కొనుగోలుకు సంబంధించిన పత్రాలను కాంగ్రెస్ సోషల్ మీడియాలో వైరల్ చేసింది.
గిరిజన సంక్షేమ శాఖ ఏమంటుందంటే..
గిరిజన సంక్షేమ శాఖ ఆరోపణలను ఖండించింది. 160 జగ్గుల కొనుగోలుకు సంబంధించిన ఓ ప్రతిపాదనను అప్పటి అసిస్టెంట్ కమిషనర్ సంజయ్ కుర్రే 2025ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వ GeM (Government e-Marketplace) పోర్టల్‌లో ఉంచారు. అయితే ఆ జగ్గుల ధర చాలా ఎక్కువగా ఉండటంతో ఫిబ్రవరి 23న ఈ ప్రతిపాదన రద్దు చేశారని చెబుతున్నారు. ఏ సంస్థకు ఎటువంటి చెల్లింపులు చేయలేదని లేదా ఆర్డర్ ఇవ్వలేదని గిరిజన సంక్షేమ శాఖ అధికారులు అంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం అవాస్తవమని, తప్పుదారి పట్టించేదని శాఖ కొట్టిపారేస్తున్నారు.
ఈ కుంభకోణంపై కాంగ్రెస్ ఉన్నత స్థాయి విచారణకు డిమాండ్ చేసింది. ప్రభుత్వ GeM పోర్టల్‌లో ధరల అధికంగా ఉన్నప్పటికీ ఈ ప్రతిపాదన ఎలా ఆమోదించారు. దీని వెనుక ఎవరు ఉన్నారనే అంశాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తోంది. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో అవినీతి ఆరోపణలకు సంబంధించి చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం పారదర్శకతను పెంచాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెబుతుంది.