
- నిబంధనలకు విరుద్ధంగా కాలేజీల నిర్వహణ
- వైద్య శాఖ స్పెషల్ డ్రైవ్‌తో అక్రమాలు వెలుగులోకి 14 కాలేజీలకు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొన్ని నర్సింగ్ కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా దందాలు చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఒక అడ్రస్‌పై పర్మిషన్ తీసుకుని.. మరోచోట గుట్టుచప్పుడు కాకుండా క్లాసులు నడుపుతున్నాయి. కనీస వసతులు, సరిపడా ఫ్యాకల్టీ లేకుండానే అడ్మిషన్లు తీసుకుంటూ స్టూడెంట్ల ఫ్యూచర్‌తో ఆడుకుంటున్నాయి. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది. రూల్స్ బ్రేక్ చేసిన 14 నర్సింగ్ కాలేజీలకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
అడ్రస్ ఒకచోట.. కాలేజీ మరోచోట..
రాష్ట్రంలో నర్సింగ్ కాలేజీల నిర్వహణపై కొద్దికాలంగా ప్రభుత్వానికి పెద్దఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన వైద్యారోగ్య శాఖ.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ జిల్లాల పరిధిలోని మొత్తం 23 నర్సింగ్ కాలేజీల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. 46 మంది అధికారులతో కూడిన బృందాలు 2 రోజుల పాటు ఈ తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో కొన్ని కాలేజీల యాజమాన్యాలు చేస్తున్న మోసం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన అడ్రస్‌లో కాకుండా, ఇష్టమొచ్చిన చోట కాలేజీలు నడుపుతున్నట్లు గుర్తించారు. నోటీసులు అందుకున్న 14 కాలేజీల్లో 7 కాలేజీలు ఏకంగా అడ్రస్ మార్చేసి తరగతులు నడుపుతున్నట్లు తేలింది.
సౌలత్లు లేవు.. ఫ్యాకల్టీ కరువు..
మరో 7 కాలేజీల్లో ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్సీ) నిబంధనల ప్రకారం.. కనీస వసతులు కూడా లేవని అధికారులు తేల్చారు. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లు ఫ్యాకల్టీ లేకపోవడం, ల్యాబ్‌లు, ఇతర మౌలిక వసతుల్లో లోపాలను గుర్తించారు. ఈ 14 కాలేజీల యాజమాన్యాలు వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని అధికారులు అల్టిమేటం జారీ చేశారు. నిబంధనలు పాటించని కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ వైద్యారోగ్య శాఖ నివేదిక సమర్పించినట్లు సమాచారం.