- నూతన్‌కల్, మద్దిరాల మండలాల సీలింగ్ భూముల సర్వే పూర్తి
- 1,780 మంది రైతులకు 2,959 ఎకరాల్లో పట్టాలు
- జులై చివరి నాటికి పట్టాలు ఇచ్చేందుకు సన్నాహాలు
సూర్యాపేట, వెలుగు: ‘దున్నేవాడికే భూములు’.. ఒకప్పటి నక్సల్స్ నినాదమిది. తెలంగాణ సాయుధ పోరాట లక్ష్యాల్లో ఇదీ ఒకటి. కానీ సూర్యాపేట జిల్లాలోని నూతన్‌కల్, మద్దిరాల మండలాల్లో ఐదు దశాబ్దాలకు పైగా సాగు చేసుకుంటున్న 1,780 మంది పేద రైతులకు భూములపై హక్కులు లేకుండా పోయాయి.
కేసీఆర్ సర్కారు తెచ్చిన ‘ధరణి పోర్టల్’లో అనుభవదారు కాలమ్ పెట్టకపోవడంతో వారి భూములు వారికి కాకుండా పోయాయి. నాడు భూసంస్కరణల్లో భాగంగా దొరల నుంచి స్వాధీనం చేసుకున్న సీలింగ్ భూములను పేదలకు పంచిన కాంగ్రెస్ సర్కారే మళ్లీ ముందరపడింది.
ఈ క్రమంలో ఈ రెండు మండలాల్లోని 15 గ్రామాల్లో దొరల భూములకు సంబంధించి రెవెన్యూ అధికారులతో చేయించిన సర్వే ఇటీవలే పూర్తయింది. సర్వే రిపోర్ట్ ప్రభుత్వానికి అందడంతో ఈ నెలలో రైతులకు పట్టాలు ఇచ్చేందుకు అధికారయంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది.
భూభారతితో నెరవేరుతున్న కల
నిజాం కాలంలో ఎర్రబాడు దొర జెన్నారెడ్డి ప్రతాపరెడ్డికి.. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల సరిహద్దుల్లో లక్షన్నర ఎకరాల భూమి ఉండేది. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో జెన్నారెడ్డికి చెందిన వేలాది ఎకరాల భూమిని పేదలకు పంచారు. 1972లో భూసంస్కరణలు అమల్లోకి రావడంతో.. చట్ట ప్రకారం ఆ కుటుంబానికి చెందిన మిగులు భూములను రైతులకు అందజేశారు. కానీ అప్పటి రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారు కాలమ్‌లో ప్రతాపరెడ్డి భార్య, కొడుకుల పేర్లుండగా, కాస్తుదారు కాలమ్‌లో భూములను సాగు చేసుకుంటున్న రైతుల పేర్లు వచ్చాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ కారణంగా కాస్తుదారు కాలమ్ నుంచి రైతుల పేర్లు ఎగిరిపోయాయి. భూముల పట్టాల్లో తిరిగి పాతయజమానులైన ప్రతాపరెడ్డి కొడుకులు శ్యాంసుందర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, ఆయన భార్య సుభద్రమ్మ పేర్ల వచ్చాయి. శ్యాంసుందర్‌రెడ్డి పేరు మీద 1,533 ఎకరాలు, సుధీర్‌రెడ్డి పేరు మీద 174 ఎకరాలు, సుభద్రమ్మ పేరు మీద135 ఎకరాల భూమి రికార్డుల్లోకి ఎక్కింది. దీంతో తమకు భూహక్కులను కల్పించాలని కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు.
ధరణి కారణంగా ఈ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు లేక అన్ని ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారు. వారు అధికారుల చుట్టూ తిరిగినా లాభం లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూభారతి అమలులోకి రావడంతో వారి సమస్యకు పరిష్కారం లభించింది. భూభారతిలో ఎంజాయ్మెంట్‌కాలాన్ని పునరుద్దరించడంతో రైతులకు పట్టాలు ఇచ్చేందుకు అవకాశం లభించింది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ రెండు మండలాల్లో మొత్తం 16 టీమ్‌లను ఏర్పాటు చేసి నెల రోజుల పాటు సర్వే నిర్వహించారు.
పూర్తయిన సర్వే.. ప్రభుత్వానికి నివేదిక
నూతన్ కల్ మండలంలో తొమ్మిది గ్రామాలు, మద్దిరాల మండలంలో ఆరు గ్రామాలలో రైతులు దొరల భూములు సాగు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సర్కారు ఆదేశాల మేరకు రెవెన్యూ టీమ్‌లు గ్రౌండ్ లెవల్ లో సర్వే చేశాయి. ఏ సర్వే నంబర్‌లో ఎంత భూమి ఉంది? ప్రస్తుతం ఎవరు సాగు చేస్తున్నారు? అన్న వివరాలను పక్కాగా సేకరించారు. అధికారుల రిపోర్ట్ ప్రకారం మొత్తం 2,960.135 ఎకరాల భూమిని సాగుచేసుకుంటున్న 1,780 మంది రైతులకు పట్టాలు ఇచ్చే అవకాశం ఉంది.
మద్దిరాల మండలంలో 127 సర్వే నెంబర్లలో 1077.155 ఎకరాలు, నూతన్ కల్ మండలంలో 187 సర్వే నెంబర్లలో 1883. 20 ఎకరాల భూమిని పేద రైతులు కాస్తు చేస్తున్నట్టు అధికారులు తేల్చారు. పొజిషన్ లో ఉన్న రైతుల స్టేట్మెంట్ ఆధారంగా పంచనామా చేసి టైటిల్, విస్తీర్ణాన్ని ఖరారు చేశారు. భూవివాదాలు ఉన్న చోట రీ సర్వే చేసి సెక్షన్ 4 ఆధారంగా సర్వే సెటిల్ మెంట్ యాక్ట్ ప్రకారం రైతుల ఇబ్బందులను తొలగించనున్నారు. ఇప్పటికే సర్వే రిపోర్టును ప్రభుత్వానికి పంపించారు. జూలై చివరి వారంలో అర్హులైన రైతులకు పట్టాలిచ్చేందుకు రెవెన్యూ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది.
రైతులకే పూర్తి హక్కులు
నూతన్‌కల్, మద్దిరాల మండలాలలో సీలింగ్ భూములకు సంబంధించిన సర్వే పూర్తయింది. ఈ నెలాఖరులోగా పట్టాలు ఇవ్వాలని నిర్ణయించాం. 1,780 మంది రైతులకు 2,959 ఎకరాలకు పట్టాలు పంపిణీ చేసి అనంతరం భూధార్ కార్డులను అందిస్తం. ప్రస్తుతం సాగు చేసుకుంటున్న కుటుంబ పెద్ద పేరు మీదనే భూయాజమాన్య పత్రాలు అందజేస్తం.
- తేజస్ నంద్ లాల్ పవార్, కలెక్టర్, సూర్యాపేట జిల్లా
