తెలుగు వర్సిటీని.. అంతర్జాతీయ స్థాయిలో నిలపాలి : జస్టిస్ ఎన్వీ రమణ

తెలుగు వర్సిటీని.. అంతర్జాతీయ స్థాయిలో నిలపాలి : జస్టిస్ ఎన్వీ రమణ
  • మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

బషీర్​బాగ్, వెలుగు : తెలుగు భాషకు జాతీయ స్థాయిలో యూనివర్సిటీ అవసరమని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. అప్పుడే తెలుగు భాషను, సంస్కృతిని భవిష్యత్ తరానికి అందించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు.  శనివారం తెలుగు వర్సిటీలో నిర్వహించిన సంస్కృతి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. బాచుపల్లిలో వందెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కాబోతున్న తెలుగు వర్సిటీని అంతర్జాతీయ యూనివర్సిటీగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలని కోరారు. వృత్తితో  రాని గుర్తింపు వివిధ వేదికలపై తెలుగు భాష పరిరక్షణ గురించి మాట్లాడినప్పుడే తనకు వచ్చిందని తెలిపారు.

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. శాస్త్రీయ విజ్ఞానాన్ని మాతృభాషల్లో అందుబాటులోకి తెస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రాంతీయ భాషల పట్ల కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మీయ అతిథి మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ.. తెలుగువారందరూ తెలుగులోనే మాట్లాడటానికి ప్రాముఖ్యతను ఇవ్వాలని కోరారు. జర్మనీ మాజీ పార్లమెంట్ సభ్యుడు డా. గుజ్జుల రవీంద్ర కార్యక్రమంలో పాల్గొని తెలుగులో మాట్లాడి సభికులను ఆకట్టుకున్నారు. అనంతరం లండన్​లోని యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేషన్(యుక్తా) వ్యవస్థాపక అధ్యక్షుడు సత్యప్రసాద్ కిల్లీకి 2023 ఏడాదికిగానూ సంస్కృతి పురస్కారాన్ని జస్టిస్ ఎన్వీ రమణ ప్రదానం చేశారు.