మంత్రివర్గంలో బ్రాహ్మణులు ఎందుకు లేరు?:NVSS ప్రభాకర్

మంత్రివర్గంలో బ్రాహ్మణులు ఎందుకు లేరు?:NVSS ప్రభాకర్
  •     జవాబు చెప్పి బ్రహ్మణ భవన్​ను సీఎం ప్రారంభించాలి: ఎన్వీఎస్ఎస్

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ గోపన్ పల్లిలో సీఎం కేసీఆర్ బుధవారం ప్రారంభించనున్న బ్రహ్మణ భవన్ పై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్ని ప్రారంభించే ముందు తాను అడిగే పది ప్రశ్నలకు జవాబు చెప్పాలని సీఎంను కోరారు. మంగళవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. సంస్కృత విశ్వవిద్యాలయాలు, వేద పాఠశాలలు ఎండోమెంట్ శాఖ ద్వారా ఎందుకు ప్రారంభించలేదో చెప్పాలని ప్రభాకర్ ప్రశ్నించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ కు కేటాయింపులేమయ్యాయని అడిగారు. శాసనమండలి సభ్యులుగా  నాస్తికులను ఎందుకు  నియమించారన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో బ్రహ్మణులకు ఎందుకు స్థానం కల్పించలేదో సమాధానం చెప్పాలని సీఎం కేసీఆర్ ను ప్రభాకర్ డిమాండ్ చేశారు. బ్రాహ్మణ న్యాయవాదులను,  పూజారులను  హత్య చేసినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ధరణి పోర్టల్ వల్ల  దేవాలయ భూములు, మాన్యం భూములు , ఇనాం భూములు అన్యక్రాంతమవుతుంటే ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందన్నారు. స్మశాన వాటికల్లో పితృకర్మల కోసం తగిన వసతులను ఎందుకు కల్పించడం లేదని ప్రభాకర్ ప్రశ్నించారు.