ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా కేటీఆర్‌‌ని విచారించాలి

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా కేటీఆర్‌‌ని విచారించాలి
  • బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్

హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా కేటీఆర్‌‌ని విచారించాలని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు స్వతహాగా ఫోన్ ట్యాపింగ్  చేశారా? డీజీపీ చెప్తే చేశారా? అప్పటి సీఎం చెప్తే చేశారా? అనేది కాంగ్రెస్ సర్కారు తేల్చాలన్నారు. అప్పటి డీజీపీని ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. డీజీపీ, కేటీఆర్, కేసీఆర్, అప్పటి మంత్రులను కలిపి విచారించాలని డిమాండ్ చేశారు.  కాళేశ్వరం, ఉచిత గొర్రెల పథకంలో జరిగిన అవినీతిపై కూడా పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరారు. గడిచిన వంద రోజుల్లో ఏ పథకం అమలు చేశారో రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌‌లోకి పోయే వాళ్లంతా కేసీఆర్, కేటీఆర్ చెబితేనే వెళ్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకరినొకరు కాపాడుకోవడం కోసం పనిచేస్తున్నాయని ప్రభాకర్ పేర్కొన్నారు.