ODI World Cup 2023: ఆ బుర్ర ఎవరిదో దేవుడికే తెలియాలి.. పాకిస్తాన్ కోచ్‌పై సెహ్వాగ్ సెటైర్లు

ODI World Cup 2023: ఆ బుర్ర ఎవరిదో దేవుడికే తెలియాలి.. పాకిస్తాన్ కోచ్‌పై సెహ్వాగ్ సెటైర్లు

సెమీస్‌ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు అద్భుతం చేసింది. ముందుంది కొండత లక్ష్యమైనా.. ఏమాత్రం బెదరకుండా సమయస్ఫూర్తిగా ఆడి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా పాక్ ఓపెనర్ ఫఖర్ జమాన్.. 402 పరుగుల లక్ష్య ఛేదనలో చెలరేగి ఆడాడు. కివీస్ బౌలర్లను చీల్చిచెండాడుతూ చిన్నస్వామి స్టేడియంలో  సిక్సర్ల వర్షం కురిపించాడు. 81 బంతుల్లో 8 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 126 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాంటి ఆటగాడిని గత మ్యాచ్‌ల్లో పక్కన పెట్టడంపై భారత మాజీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ స్పందించారు. 

ఫఖర్ జమాన్‌ను పాకిస్తాన్ అత్యుత్తమ బ్యాటర్ గా వర్ణించిన సెహ్వాగ్.. అతడి బాల్ హిట్టింగ్ సామర్థ్యాన్ని (సిక్సర్లు కొట్టే తీరును) మరో లెవెల్‌లో పొగిడారు. జమాన్ ఒక్కడే 3 ఇన్నింగ్స్‌లలో 18 సిక్సర్లు కొడితే.. మిగిలిన పాక్ బ్యాటర్లందరూ కలిపి 8 గేమ్‌లలో 36 సిక్సర్లు కొట్టారని ఎద్దేవా చేశారు. ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించగల ఇలాంటి ఒక ఆటగాడిని పక్కన పెట్టాలన్న ఆలోచన ఎవరిదో కానీ.. ఆ  బుర్ర దేవుడికే తెలియాలి అంటూ పాక్ కోచ్‌ను ఉద్దేశిస్తూ సెటైర్లు వేశారు. 

" ఫఖర్ జమాన్ అద్భుతంగా ఆడాడు.. ఈ టోర్నీలో ఇప్పటివరకూ ఒక పాకిస్తాన్ బ్యాటర్ ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇదే. గత మ్యాచ్‌ల్లో అతన్ని పక్కన పెట్టారు. ఆ ఆలోచన ఏ మెదడులో తట్టిందో దేవుడికే తెలియాలి.. ప్రోటీన్ కి భీ కమీ నహిన్, జజ్బే కి భీ.." అని సెహ్వాగ్ ట్వీట్ చేశారు.

ఆశలన్నీ శ్రీలంకపైనే

ఈ టోర్నీలో ఇప్పటివరకూ 8 మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్ నాలుగింటిలో విజయం సాధించి.. ఐదో స్థానంలో( 8 పాయింట్లు) ఉంది. ఇక మిగిలింది ఒకే ఒక్క మ్యాచ్. తమ చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడాల్సి ఉంది.  వారు ఆ మ్యాచ్‌లో విజయం సాధించినా.. శ్రీలంకతో జరిగే మ్యాచ్ న్యూజిలాండ్ ఓడిపోవాలని కోరుకోవాలి. ఈ రెండూ అనుకున్నట్లు జరిగినా ఆ జట్టు నెట్ రన్‌రేట్ ప్రభావం చూపేలా ఉంది. ప్రస్తుతం పాక్ నెట్ రన్‌రేట్ మైనస్‌లో ఉంది.

ALSO  READ : ధోనీ నాకు క్లోజ్ ఫ్రెండ్ కాదు.. అతని నిర్ణయాలు నాకు నచ్చవు: యువరాజ్ సింగ్