ధోనీ నాకు క్లోజ్ ఫ్రెండ్ కాదు.. అతని నిర్ణయాలు నాకు నచ్చవు: యువరాజ్ సింగ్

ధోనీ నాకు క్లోజ్ ఫ్రెండ్ కాదు.. అతని నిర్ణయాలు నాకు నచ్చవు: యువరాజ్ సింగ్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ సాన్నిహిత్యం గురించి మనందరికీ తెలిసిందే. మాహీ కెప్టెన్ అయిన తర్వాత వీరిద్దరూ టీమిండియాకు ఎన్నో మరపురాని విజయాలను అందించారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు భాగాస్వామ్యాలను నిర్మించడంలో వీరిద్దరూ దిట్ట.  ఈ క్రమంలోనే  యువీ, ధోనీ ఫ్రెండ్ షిప్ మరింత బలపడింది. అప్పట్లో యువీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కు  బైక్ గిఫ్ట్ గా వచ్చిన ప్రతిసారి ధోనీ యువీతో  కలిసి గ్రౌండ్ మొత్తం తిరిగినప్పుడు వీరు బెస్ట్ ఫ్రెండ్స్ అని అంతా భావించారు. కానీ యువరాజ్ మాత్రం ధోనీ తనకు క్లోజ్ ఫ్రెండ్ కాదని షాకింగ్ కామెంట్స్ చేసాడు. 

రణ్వీర్ షో లో పాల్గొన్న యువరాజ్ సింగ్ ధోనీ గురించి మాట్లాడుతూ " ధోని, నేను క్లోజ్ ఫ్రెండ్స్ కాదు. మా ఇద్దరి జీవన శైలి చాలా భిన్నంగా ఉంటుంది. క్రికెట్ కారణంగానే మేమిద్దరం స్నేహితులం. నేను,మహి మైదానంలోకి వెళ్ళినప్పుడు, దేశానికి 100% ఎఫర్ట్ ఇచ్చాము. ధోనీ కెప్టెన్ గా, నేను వైస్ కెప్టెన్ గా చేసినప్పుడు మా ఇద్దరి నిర్ణయాలు ఒక్కోసారి కుదిరేవి కావు. కొన్నిసార్లు అతను నాకు నచ్చని నిర్ణయాలు తీసుకుంటే మరికొన్ని సార్లు అతడికి నచ్చని నిర్ణయాలు నేను తీసుకునేవాడిని" అని యువీ చెప్పుకొచ్చాడు. 

ధోనీ, యువరాజ్ సింగ్ భారత జట్టులో ఉన్నప్పుడు టీమిండియా 2007 టీ 20, ప్రపంచ కప్ తో పాటు, 2011 లో వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంది. ఈ రెండు వరల్డ్ కప్ లు సాధించేంచడంలో కెప్టెన్ గా ధోనీ పాత్ర ఎంత ఉందో యువరాజ్ సింగ్ పాత్ర అంతకన్నా ఎక్కువగానే ఉందని చెప్పాలి. 2007 టీ 20 వరల్డ్ కప్ సెమీస్ లో యువీ ఆస్ట్రేలియా మీద ఆడిన ఇన్నింగ్స్, 2011 లో క్వార్ట్రర్ ఫైనల్లో ఆసీస్ పై ఆడిన ఇన్నింగ్స్ హైలెట్ గా నిలిచాయి. 2011 లో యువీ క్యాన్సర్ తో పోరాడి ప్లేయర్ ఆఫ్ ది  సిరీస్ గా నిలిచిన సంగతి తెలిసిందే.