
- వారు ప్రభుత్వ సర్వెంట్ల పరిధిలోకి వస్తారు: హైకోర్టు
- సీఐపై కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరైనవేనంటూ తీర్పు
హైదరాబాద్, వెలుగు: కోర్టు నియమించిన అడ్వకేట్ కమిషనర్ల విధులను సీఐ అడ్డుకున్న కేసులో కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చట్టబద్ధమేనని హైకోర్టు వెల్లడించింది. అడ్వకేట్ కమిషనర్లు పబ్లిక్ సర్వెంట్ల కిందకు వస్తారని పేర్కొంది. అడ్వకేట్ కమిషన్‌ను అడ్డుకున్న సీఐపై చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు నమోదు చేసిన కేసును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
2012లో అడ్వకేట్ కమిషనర్ల విధులకు అడ్డుతగిలారని పేర్కొంటూ వరంగల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) తనపై నమోదు చేసిన కేసును డిస్మిస్ చేయాలంటూ హనుమకొండ సుబేదారి పోలీసు స్టేషన్ అప్పటి సీఐ వి.సురేశ్ వేసిన పిటిషన్‌లో ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. 2012 డిసెంబర్ 21న కాకతీయ ఉత్సవాలకు అప్పటి సీఎం హాజరుకానున్న సందర్భంగా సీఎం కాన్వాయ్‌కి అడ్డుపడి, రాళ్లు విసిరేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ నాటి టీఆర్‌ఎస్ సపోర్టర్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
. వారిపై పోలీస్ స్టేషన్‌లో థర్డ్ డిగ్రీ ప్రయోగించి, చిత్రహింసలకు గురిచేసే అవకాశం ఉండటంతో ఈ వ్యవహారంపై అడ్వకేట్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ సీజేఎం కోర్టులో అడ్వకేట్ అబ్దుల్ నబీ దరఖాస్తు చేశారు. దీంతో సీజేఎం లాయర్లు కె.రమేశ్, ఎం.రవీందర్‌ను అడ్వకేట్ కమిషనర్లుగా కోర్టు నియమించింది.
కావాలనే విధులను అడ్డుకున్నరు..
2012 డిసెంబర్ 21న పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, అక్కడ నలుగురు నిందితులు ఉన్నట్లు అడ్వకేట్ కమిషనర్లు గుర్తించారు. స్టేషన్‌కు వెళ్లిన కమిషన్ సభ్యులను సీఐ సురేశ్ ఇతర పోలీసులు అడ్డుకున్నారు. ఇదే విషయాన్ని కమిషనర్లు వరంగల్ కోర్టుకు రిపోర్టు ఇచ్చారు. మరోవైపు, అదే రోజు రాత్రి 10:55 గంటలకు నిందితులను సీజేఎం కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. అప్పటికే అడ్వకేట్ కమిషన్ సమర్పించిన నివేదికను సీఐ సురేశ్‌కు కోర్టు అందజేస్తూ.. ఆయనపై సుమోటో కేసు నమోదు చేసింది. దీనిని సురేశ్ హైకోర్టులో సవాల్ చేశారు.
కాగా, ఐపీసీ సెక్షన్ 21 ప్రకారం అడ్వకేట్ కమిషన్ కోర్టు ఆదేశాలతో విధులు నిర్వహిస్తున్నారని, అందువల్ల వారు పబ్లిక్ సర్వెంట్ల పరిధిలోకి వస్తారన్నారని హైకోర్టు చెప్పింది. పోలీస్ స్టేషన్‌లో ఉన్న నిందితులను జడ్జి ముందు హాజరుపరచాలన్నది కోర్టు ఆదేశమనే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ విషయం సీఐగా చేస్తున్న పిటిషనర్‌కు తెలిసి కూడా అడ్వకేట్ కమిషనర్ల విధులను అడ్డుకున్నారని తప్పుబట్టింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న వరంగల్ సీజేఎం పిటిషనర్ సురేశ్‌పై కేసు నమోదు చేసిందని, కింది కోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది.