చార్మినార్, వెలుగు: చార్మినార్ ఠాణా స్థలం కబ్జాకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చార్మినార్ పాత పోలీస్ స్టేషన్ వెనక భాగంలోని 840 గజాల ప్రభుత్వ స్థలాన్ని బహదూర్ పుర రెవెన్యూ అధికారులు 2002లో టూరిజం శాఖకు కేటాయించారు. ఈ భూమి తమదేనంటూ ఖాలేద్ హైమద్తోపాటు ఆయన కొడుకులు మక్బూల్ హైమద్, బషీర్ హైమద్, మహమ్మద్ అలీ హైమద్, ఫయాజ్ నజీర్ 2004లో కోర్టును ఆశ్రయించారు.
దీనిపై రెవెన్యూ అధికారులు, ప్రైవేటు వ్యక్తులకు మధ్య కొన్నాళ్లు హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ కేసు నడిచింది. ఆ తర్వాత కేసును సుప్రీంకోర్టు కొట్టివేయడంతో టూరిజం శాఖ ఆధీనంలో ఉన్న స్థలాన్ని చార్మినార్ కొత్త పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం కేటాయించారు. అయితే, ఈ స్థలాన్ని ఖాలేద్ హైమద్ కొడుకులు కబ్జా చేసి నిర్మాణాల చేపట్టారని ఈ నెల 5న పురావస్తు శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు వారిపై ఈ నెల 17న సుమోటో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.