దేవుడి భూములనూ వదుల్తలే

దేవుడి భూములనూ వదుల్తలే
  • చారిత్రక ఉండ్రుగొండ దేవస్థానం భూములు కబ్జా
  • ఎండోమెంట్ భూములకు పట్టా ఇచ్చిన రెవెన్యూ శాఖ!
  • వెంచర్​కోసం ఆరు ఎకరాలు చదును చేసిన లీడర్
  • అడ్డుగా ఉన్నదని పురాతన హనుమాన్ గుడి కూల్చివేత

సూర్యాపేట, వెలుగు: రాష్ట్రంలో- టీఆర్ఎస్ లీడర్ల భూ కబ్జాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వ, అసైన్డ్, చెరువు శిఖం భూములనే కాదు.. ఆఖరికి దేవాదాయ భూములనూ వదలట్లేదు. సూర్యాపేట జిల్లాలో ఓ టీఆర్ఎస్ నేత.. ఆలయ భూముల కోసం పురాతన ఆలయాన్ని ధ్వంసం చేశాడు. చారిత్రక ఉండ్రుగొండ దేవస్థానానికి చెందిన భూములను ఆక్రమించుకోవడమే కాక.. వెంచర్‌‌కు అడ్డువస్తున్నదని రాత్రిపూట ఆలయాన్ని పడగొట్టించాడు. తరతరాలుగా పూజలందుకుంటున్న హనుమంతుడి విగ్రహాన్ని పెకిలించి పక్కన పెట్టాడు.
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని ఉండ్రుగొండ గిరిదుర్గం ఒకప్పుడు విష్ణు కుండినుల పాలనా కేంద్రంగా ఉండేది. 1,372 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎనిమిది గుట్టల పైన, కింద అనేక దేవాలయాలు, 32 పిల్లర్లతో కూడిన కొలువుసావిడి, పెద్దసంఖ్యలో కాలభైరవ విగ్రహాలున్నాయి. ప్రధానంగా ఇక్కడ స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, శివాలయం, శ్రీరామ మందిరం, హనుమాన్ ఆలయాలను క్రీ.శ. 5వ శతాబ్దంలోనే నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. నాటి నుంచి తరతరాలుగా ఆలయాల్లో స్థానికులు పూజలు చేస్తున్నారు. ఈ ఆలయాలకు ప్రధానంగా సర్వే నంబర్ 207, 208, 209, 210, 211లలో 109 ఎకరాల మాన్యం భూములున్నాయి.  2015కి ముందు ఈ  భూములన్నీ దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో.. వీటిలో ఆరు ఎకరాల భూమి  టీఆర్ఎస్ మాజీ మున్సిపల్ చైర్​పర్సన్​ ​భర్త, ప్రస్తుత సూర్యాపేట కౌన్సిలర్ గండూరి ప్రకాశ్‌ తండ్రి రామస్వామి పేరిట మారింది. ప్రకాశ్ అప్పట్లో ఉండ్రుగొండ దేవస్థానం కమిటీ చైర్మన్‌గా పని చేశారు. దీంతో రెవెన్యూ ఆఫీసర్ల సాయంతో దేవాదాయ శాఖకు చెందిన ఈ ఆరు ఎకరాలను తన తండ్రి పేరుతో రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కించారనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ భూములకు కొత్త పాస్​బుక్‌లు కూడా ఇచ్చింది. ధరణిలోనూ వివారాలు నమోదయ్యాయి. ఎలాంటి పంట సాగు చేయకుండానే ఏటా రెండు సార్లు రూ.60 వేల చొప్పున రైతుబంధు అందుకుంటుండటం గమనార్హం.

వెంచర్‌‌ కోసం భూమి చదును
ఇటీవల ఉండ్రుగొండను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి జగదీశ్​రెడ్డి ప్రకటించారు. దీంతో ఇక్కడి భూములకు డిమాండ్ పెరిగిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన టీఆర్ఎస్ నేత ప్రకాశ్‌.. ఆ ఆరు ఎకరాల్లో వెంచర్‌‌కు ప్లాన్ చేశాడు. కొన్ని రోజులుగా భూములను చదును చేయిస్తున్నాడు. అయితే వెంచర్‌‌కు అక్కడి పురాతన హనుమాన్ ఆలయం, కొలువుసావిడి అడ్డువచ్చాయి. దీంతో ఓ అర్ధరాత్రి టెంపుల్‌ను పూర్తిగా, కొలువుసావిడిని పాక్షికంగా ధ్వంసం చేశారని, హనుమంతుడి విగ్రహాన్ని పక్కనే పెట్టేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. విషయం బయటకు రావడంతో హనుమాన్​ జయంతి సందర్భంగా సుమారు 400 మంది ఆంజనేయ భక్తులు సూర్యాపేట నుంచి ఉండ్రుగొండ వరకు ర్యాలీ తీసేందుకు సిద్ధం కాగా.. పోలీసులు పర్మిషన్​ లేదని అడ్డుకున్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఇక్కడి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి పోలీసులు తాళం వేశారు.

ఆలయాలు కాపాడాలంటూ గతంలో లేఖ
ఉండ్రుగొండలో ఆనవాళ్లు కోల్పోతున్న చారిత్రక కట్టడాలను, విగ్రహాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్​రెడ్డి.. 2015 మే నెలలో హైదరాబాద్‌లోని ఆర్కియాలజీ డైరెక్టర్‌‌కు లేఖ రాశారు. ఇక్కడి కోట చరిత్ర, విశిష్టతను వివరిస్తూ పరిరక్షణ లేకపోవడం వల్ల కట్టడాలు​శిథిలమైపోతున్నాయని, గుప్త నిధుల కోసం జరుపుతున్న తవ్వకాలతో ఆలయాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. అన్యాక్రాంతమవుతున్న ఎండోమెంట్ భూములను కాపాడాలని కోరారు. తీరా ఆ పార్టీకి చెందిన లీడరే ఆలయ భూములను కబ్జా చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆలయం కూల్చివేతతో నాకు సంబంధం లేదు 
ప్రతిపక్షాలు కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నాయని, దేవాదాయ శాఖకు చెందిన ఎలాంటి భూములను తాను ఆక్రమించలేదని -గండూరి ప్రకాశ్‌‌ అన్నారు. 2015లో ఆ భూములను అధికారికంగా కొనుగోలు చేశానన్నారు. ఆలయం కూల్చివేతతో సంబంధం లేదని, దీనిపై ఎంక్వైరీ చేసినా సహకరిస్తానని తెలిపారు.

న్యాయ పోరాటం చేస్తం
కొందరు రెవెన్యూ అధికారులు దేవాదాయ శాఖకు చెందిన భూములను టీఆర్ఎస్ లీడర్‌‌కు అక్రమంగా పట్టాలు చేశారు. ఇటీవల వెంచర్ చేసేందుకు భూముల్లో ఉన్న హనుమాన్ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. దీంతో దేవాలయ పరిరక్షణ కోసం మేం ర్యాలీ చేపట్టాలని ప్రయత్నిస్తే.. పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. దర్శనానికి చాన్స్ ఇవ్వలేదు.  దీనిపై పోరాటం చేస్తం.
- నామ రాంరెడ్డి, వానరసేన రాష్ట్ర అధ్యక్షుడు

చర్యలు తీసుకుంటం
ఉండ్రుగొండలో వివాదాస్పద 6 ఎకరాల భూములపై గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. ఆయా సర్వే నంబర్లలో గతంలో ఎండోమెంట్‌ భూములు ఉన్నాయి. అవి ప్రైవేట్ వ్యక్తులకు ఎలా పట్టా అయ్యాయో ఎంక్వైరీ చేస్తం. ఆక్రమించినట్లు తేలితే చర్యలు తీస్కుంటం. 
- రంగారావు, తహసీల్దార్, చివ్వెంల