2 స్థానాలు.. 10 జట్లు.. నేటి నుంచే వరల్డ్ కప్ 2023 సమరం

2 స్థానాలు.. 10 జట్లు.. నేటి నుంచే వరల్డ్ కప్ 2023 సమరం

ఈ ఏడాది చివరలో భారత్ వేదికగా జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌ 2023 సమరానికి రంగం సిద్ధమైంది. నేటి నుంచి క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అంటే.. వరల్డ్ కప్ 2023 తుది పోరుకు 8 జట్లు నేరుగా అర్హత సాధించగా.. మరో రెండు జట్లు క్వాలిఫయర్ మ్యాచుల ద్వారా అర్హత సాధిస్తాయన్నమాట. 

మొత్తం 10 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ జింబాబ్వే వేదికగా జూన్ 18 నుంచి జూలై 9 వరకు జరగనుంది. టాప్-2లో నిలిచిన జట్లు ప్రపంచ కప్‌కు అర్హత సాధిస్తాయి. పది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్- 'ఏ'లో వెస్టిండీస్, జింబాబ్వే, నెదర్లాండ్స్, నేపాల్, యూఎస్‌ఏ ఉండగా.. గ్రూప్- 'బి'లో శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఒమన్, యూఏఈ జట్లు ఉన్నాయి. ఇక్కడ గెలిచిన జట్లు భారత్‌లో ప్రపంచకప్‌ ఆడేందుకు రానున్నాయి. 

టాప్‌-2లో నిలిచిన జట్లు ప్రపంచ కప్ పోరుకు.. 

క్వాలిఫయర్ మ్యాచులలో ప్రతి జట్టు తమ గ్రూప్‌లోని ఇతర జట్లతో ఒక మ్యాచ్‌ ఆడనుంది. ప్రతి గ్రూప్‌లోని మొదటి మూడుస్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్‌కు అర్హత సాధిస్తాయి. ఇక్కడ టాప్‌-2లో నిలిచిన జట్లు.. ఫైనల్‌ ఆడడంతో పాటు భారత్‌లో జరిగే ప్రపంచ కప్ 2023కి చేరుకుంటాయి. 

జింబాబ్వే వేదికగా మ్యాచ్‌లు..

క్వాలిఫయర్స్ పోరులో ఫైనల్‌తో సహా మొత్తం 34 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లు జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్, తకాషింగా స్పోర్ట్స్ క్లబ్, బులవాయో అథ్లెటిక్ క్లబ్, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ బులవాయోతో సహా 4 వేదికలపై జరుగుతాయి. క్వాలిఫయర్ రౌండ్‌లో తొలి మ్యాచ్ జింబాబ్వే, నేపాల్ మధ్య జరగనుంది.

2023 ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించిన జట్లు: ఇండియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా.