V6 News

ఈ పనేదో ముందే చేసి ఉండొచ్చు కదా.. వీడియో వైరల్ అయి విమర్శలు.. ఆ తర్వాతే చేతికి డబ్బులు !

ఈ పనేదో ముందే చేసి ఉండొచ్చు కదా.. వీడియో వైరల్ అయి విమర్శలు.. ఆ తర్వాతే చేతికి డబ్బులు !

సోషల్ మీడియా పుణ్యమా అని ఒడిశాకు చెందిన ఒక పెద్దాయన తన అక్క అస్థి పంజరాన్ని బ్యాంకుకు మోసుకెళుతున్న వీడియో వైరల్ అయి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో ఒక గిరిజన వ్యక్తి తన సోదరి ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి, ఆమె మరణించినట్లు రుజువుగా ఆమె అస్థిపంజరాన్ని బ్యాంకుకు తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. ఈ వీడియో వైరల్ కావడంతో స్థానిక అధికార యంత్రాంగంపై, బ్యాంకు సిబ్బందిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఈ ఘటన రచ్చ రచ్చ కావడంతో సదరు బ్యాంకు పరువు పోయింది. దీంతో.. మంగళవారం (ఏప్రిల్ 28, 2026) రోజు ఈ వీడియో వైరల్ అయిన కొన్ని గంటల్లోనే.. పరిపాలన యంత్రాంగం యమా స్పీడ్గా స్పందించింది. ఒక్క రోజులోనే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి.. అతనికి తన అక్క ఖాతాలోని డబ్బును చెల్లించింది. అతను డబ్బు తీసుకున్న వీడియోను విడుదల చేసింది. ఈ పనేదో ముందే చేసి ఉంటే పరువైనా దక్కి ఉండేది. అధికార యంత్రాంగం అలసత్వం, బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాక స్పందించడంతో మన దేశంలో ఏ పనీ త్వరితగతిన జరగదనే విషయం మరోసారి రుజువు చేసినట్లయింది.

అసలేమైందంటే..
ఒక వైపు ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థ.. మరోవైపు అక్షరం ముక్క రాని అమాయకత్వం. ఈ రెండింటి మధ్య నలిగిపోయిన ఒక పేదవాడి వేదన ఇది. ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఉదంతం, వ్యవస్థలోని లోపాలను, సామాన్యుడి నిస్సహాయతను కళ్లకు కడుతోంది. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు.. కియోంజర్ జిల్లా మల్లిపోసి గ్రామానికి చెందిన జీతూ ముండా అనే గిరిజనుడి సోదరి కల్రా ముండా రెండు నెలల క్రితం మరణించింది. 

స్థానిక గ్రామీణ బ్యాంకులోని ఆమె ఖాతాలో రూ.19,300 నగదు ఉంది. కల్రా ముండా చనిపోవడంతో ఆమె ఖాతాలోని సొమ్మును తీసుకోవడం కోసం ఆమె సోదరుడు జీతూ ముండా బ్యాంకుకు వెళ్లాడు. అయితే, అలా డబ్బులు ఇవ్వడం కుదరదని, కల్రా ముండా చనిపోయిందనేందుకు రుజువుగా డెత్ సర్టిఫికెట్ తో పాటు ఆమెతో జీతూ ముండా బంధుత్వాన్ని నిర్ధారించే పత్రాలను తీసుకురావాలని బ్యాంకు సిబ్బంది చెప్పారు. కల్రా ముండా తన సొంత అక్కయ్యేనని, ఆమె నిజంగానే చనిపోయిందని ఎంత చెప్పినా వారు వినిపించుకోలేదు. ప్రాధేయపడ్డా వారు కనికరించలేదు. 

రూల్స్కు విరుద్ధంగా డబ్బులు ఇవ్వలేమని స్పష్టం చేశారు. నిరక్షరాస్యుడైన జీతూ ముండాకు ఈ విషయాలేవీ అర్థం కాలేదు. బ్యాంకు సిబ్బంది కూడా అర్థమయ్యేలా చెప్పలేదు. జీతూకు అర్థమైందల్లా తన సోదరి ‘కల్రా ముండా చనిపోయిందంటే బ్యాంకు వాళ్లు నమ్మడం లేదు.. సాక్ష్యం అడుగుతున్నారు. తన సోదరి చనిపోయిందని సాక్ష్యం చూపించకుంటే డబ్బులు రావు’ అర్థమైంది. 

దీంతో అప్పటికి బ్యాంకు నుంచి వెళ్లిపోయిన జీతూ.. ఈ నెల 27న కల్రా ముండా సమాధి వద్దకు వెళ్లాడు. రెండు నెలల క్రితం పాతిపెట్టిన సోదరి మృతదేహాన్ని తవ్వి తీసి, ఓ సంచీలో కట్టి భుజంపై మోసుకుంటూ బ్యాంకుకు తీసుకెళ్లాడు. అస్థిపంజరాన్ని మోసుకుంటూ జీతూ ముండా నడిచి వెళుతున్న దృశ్యాలను స్థానికులు మొబైల్ ఫోన్​లో రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఆ వీడియో వైరల్ గా మారడంతో యావత్ దేశం నివ్వెరపోయింది.