సూపర్ స్కీమ్ .. లారీ డ్రైవర్లకు ఉచితంగా టీ

 సూపర్ స్కీమ్ ..  లారీ డ్రైవర్లకు ఉచితంగా టీ

ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  రాత్రిపూట ప్రయాణించే లారీ  డ్రైవర్లకు ఫ్రీగా టీ అందించే ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆ రాష్ట్ర మంత్రి టుకుని సాహు తెలిపారు. దీనికి సంబంధించిన ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు.  రహదారులపై తరచుగా జరుగుతున్న ప్రమాదాల్లో ఎంతోమంది మృతి చెందుతున్నారని, ఈ పరిస్థితిని నియంత్రించాలని సీఎం  నవీన్‌ పట్నాయక్‌ ఆదేశించారని ఆమె చెప్పారు.   

రహదారుల్లో ఉన్న దాబాలు, హోటళ్లలో లారీ డ్రైవర్లకు ఉచితంగా టీ పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు టుకుని సాహు తెలిపారు. అంతేకాకుండా  30 జిల్లాల్లో లారీ టెర్మినళ్లు నిర్మిస్తామని.. అందులో నిద్రించడానికి, స్నానాలు చేయడానికి సౌకర్యాలుంటాయని తెలిపారు.  టీ, కాఫీలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు.  

ఈ కార్యక్రమం 2024 జనవరి 1నుంచి ప్రారంభం కానుంది.  ఉదయం 3 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ట్రక్ డ్రైవర్లకు ఉచిత టీ అందించాలని ఒడిశా ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. 2018 నుంచి 2022 మధ్య ఐదేళ్లలో ఒడిశాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 25,934 మంది మరణించారని, 51వేలకు పైగా గాయపడ్డారని  మంత్రి తెలిపారు.