పిల్లలు చదువుకునే పుస్తకాల్లో ఇన్ని తప్పులా.. తయారు చేసినోళ్లను అరెస్ట్ చేసి జైల్లో వేయండి..!

పిల్లలు చదువుకునే పుస్తకాల్లో ఇన్ని తప్పులా.. తయారు చేసినోళ్లను అరెస్ట్ చేసి జైల్లో వేయండి..!

భువనేశ్వర్: విద్యార్థుల జీవితంలో పుస్తకాల పాత్ర అత్యంత కీలకం. పుస్తకాలను జ్ఞాన గనులు అంటుంటారు. బుక్స్ చదవడం ద్వారా విద్యార్థులు జ్ఞానాన్ని సంపాదిస్తారు. ఎన్నో కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటారు. విద్యార్థుల కెరీర్‎లో ఇంతటి కీలక పాత్ర పోషించే పుస్తకాల్లో తప్పులు దొర్లితే అది విద్యార్థుల భవిష్యత్‎కే ప్రమాదకరం. తాజాగా ఒడిషాలో ఇదే జరిగింది. 1 నుంచి 8వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు తప్పుల తడకగా ఉన్నాయి. 

పుస్తకాల్లో ఏకంగా 1,678 తప్పులు దొర్లాయి. పిల్లలు చదువుకునే పుస్తకాల్లో భారీగా తప్పులు ఉండటంపై ఒడిషా ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై గుర్రుగా ఉన్న సీఎం మోహన్ చరణ్ మాఝీ పాఠ్య పుస్తకాల్లో తప్పుల ఘటనపై క్రిమినల్ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ మొత్తం ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపేందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని క్రైమ్ బ్రాంచ్‎కు ఆదేశాలు జారీ చేశారు. పాఠ్యపుస్తకాల తయారీలో జరిగిన లోపాలు నేరపూరిత బాధ్యతను మోపాల్సినంత తీవ్రమైనవని ఆయన పేర్కొన్నారు. 

విద్యా వ్యవస్థపై విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బాధ్యులను గుర్తించి, దిద్దుబాటు చర్యలను త్వరితగతిన అమలు జరిగేలా చూడటమే ఈ దర్యాప్తు లక్ష్యమని తెలిపారు. ఈ ఘటనలో మాజీ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్, ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్లను సస్పెండ్ చేయగా.. మరో ఆరుగురిపై క్రమశిక్షణా చర్యలకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. తప్పులున్న పాఠ్యపుస్తకాలను పాఠశాలల నుంచి వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.