నేను చావలేదు, బతికే ఉన్న.. వందలాది శవాల మధ్య నుంచి బయటకు

నేను చావలేదు, బతికే ఉన్న.. వందలాది శవాల మధ్య నుంచి బయటకు

భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్​లో జరిగిన రైలు ప్రమాదంలో చనిపోయాడనుకుని వందలాది శవాల మధ్య పడేసిన ఓ వ్యక్తి ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. శవాలు తరలిస్తున్న టైంలో రెస్క్యూ సిబ్బందిలో ఒకతని కాలు పట్టుకుని ‘‘నేను బతికే ఉన్నాను.. చనిపోలేదు.. ప్లీజ్​ నీళ్లు ఇవ్వండి”అంటూ వేడుకున్నాడు. దీంతో అతన్ని వెంటనే హాస్పిటల్​కు తరలించారు. వెస్ట్​ బెంగాల్​లోని నార్త్ 24 పరగణా జిల్లా చర్నేఖలి గ్రామానికి చెందిన 35ఏండ్ల రాబిన్​ నయ్య, తన ఆరుగు ఫ్రెండ్స్ తో పని కోసం వెతుక్కుంటూ కోరమండల్ ఎక్స్​ప్రెస్​లో ఏపీకి బయలుదేరాడు.

యాక్సిడెంట్ తర్వాత రాబిన్ తన రెండు కాళ్లు కోల్పోయి పట్టాలపై పడి ఉన్నాడు. చనిపోయాడనుకుని మూటగట్టి రెస్క్యూ సిబ్బంది అతన్ని పట్టాల పక్కనే ఉన్న స్కూల్ రూమ్​లోకి తీసుకెళ్లి శవాల మధ్య పడుకోబెట్టారు. కొన్ని గంటల తర్వాత శవాలు తరలించేందుకు రెస్క్యూ వర్కర్స్ రూమ్​లోకి వెళ్లారు. డెడ్​బాడీల మధ్య తిరుగుతున్న టైంలో ఎవరో కాళ్లు పట్టుకున్నట్లు ఓ రెస్క్యూ వర్కర్​కు అనిపించింది. కింద చూసేందుకు భయమనిపించినా.. ఆ వర్కర్ ధైర్యంగా చూస్తే.. ‘‘నేను బతికే ఉన్నాను.. చనిపోలేదు.. ప్లీజ్ నీళ్లు ఇవ్వండి” అంటూ రాబిన్ ప్రాధేయపడుతూ కనిపించాడు. దీంతో వెంటనే మిగిలిన రెస్క్యూ వర్కర్స్ సాయంతో రాబిన్​ను మేదినీపూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్​కు తరలించాడు.

రెండు కాళ్లు కోల్పోయిన రాబిన్ హెల్త్​ కండిషన్ సీరియస్​గానే ఉంది. ఆర్థోపెడిక్ వార్డులో ట్రీట్​మెంట్ పొందుతున్నాడు. రాబిన్​తో వచ్చిన ఆరుగురు ఫ్రెండ్స్ జాడ కూడా తెలియరాలేదు. 2010లో కూడా రాబిన్ ఫ్యామిలీ మెంబర్​కు ఇలాగే జరిగింది. ‘‘మా అన్నతో కలిసి జ్ఞానేశ్వరీ ఎక్స్​ప్రెస్​లో వెళ్తున్నాను. గూడ్స్ రైలును ఢీకొట్టడంతో మా ట్రైన్ పట్టాలు తప్పింది. మా అన్న చనిపోయాడనుకుని రెస్క్యూ వర్కర్స్ అతన్ని శవాల మధ్య పడుకోబెడితే.. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి ఫోన్ చేశాడు”అని రాబిన్ నయ్య మామ మానబేంద్ర సర్దార్ చెప్పుకొచ్చాడు.