హ్యాట్సాఫ్ : 36 గంటల్లో 3 వేల మంది రక్తదానం

హ్యాట్సాఫ్  : 36  గంటల్లో 3 వేల మంది రక్తదానం

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో గాయపడిన బాధితులను  ఆదుకోవడానికి ముందుకు వచ్చిన స్థానికలకు ఇప్పుడు దేశం మొత్తం హ్యాట్సాఫ్ చెబుతోంది.  ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ప్రజలు సహాయక చర్యలలో మునిగిపోయారు. చాలా మంది యవత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మరి రక్తదానం చేయడానికి బారులు తీరారు. అర్ధరాత్రి సమయంలో కూడా గంటల కొద్ది క్యూలైన్ లో నిల్చుని  ప్రమాద బాధితులకు అవసరమైన రక్తాన్ని దానం చేశారు.

కటక్, బాలాసోర్, భద్రక్‌లలో 2023 జూన్ 02  శుక్రవారం రాత్రి నుంచి 3 వేల యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించామని, రక్తదానం చేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని ఎస్‌సిబి మెడికల్ కాలేజీ హాస్పిటల్ మెడిసిన్ ప్రొఫెసర్ జయంత్ పాండా తెలిపారు.  వాస్తవానికి  ప్రమాదం జరగకముందు కటక్, బాలాసోర్, భద్రక్‌ ఆసుపత్రులలో  900 యూనిట్ల బ్లడ్ మాత్రమే ఉందని, బాధితులు తీవ్ర సంఖ్యలో ఉండటంతో మరో వెయ్యి యూనిట్ల బ్లడ్ అవసరమని వైద్యులు అంచనా వేశారు

దీంతో బాధితులకు తమవంతు సహయం చేసేందుకు స్థానిక యవత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం  చేశారు. ఇందులో మహిళలు కూడా ఉన్నారు. ఇంకా రక్తదానం  చేసేందుకు సిద్దంగా ఉన్నామని మరికొంత మంది యువత ముందుకు  వస్తున్నారు. వయస్సు రీత్యా రక్తదానం చేయలేని వృద్ధులు బాధితుల బంధువులకు ఫోన్లు చేయడంలో సహాయపడ్డారు. 

ప్రమాదంలో అయినవారిని కోల్పోయిన చిన్నారుల సంరక్షణ బాధ్యతను తీసుకున్నారు. ఇక మరికొందరు అందుబాటులో ఉన్న వాహనాల్లో గాయపడ్డవారిని సమీప దవాఖానలకు తరలించారు. ఇలాంటి సంక్షోభ సమయంలో స్థానికులు స్పందించిన తీరు పట్ల నెటిజన్లు సోషల్ మీడియాలో హ్యాట్సాఫ్ చెబుతున్నారు.  కష్ట సమయంలో మనిషిని మనిషే ఆదుకోవాలి. మీరు దేశానికే స్ఫూర్తి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.