పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం ఆఫర్స్... రంగంలోకి ఆశావహులు.. 50 లక్షల నుంచి కోటి దాకా పెట్టేందుకు రెడీ

పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం ఆఫర్స్... రంగంలోకి ఆశావహులు.. 50 లక్షల నుంచి కోటి దాకా పెట్టేందుకు రెడీ
  •  
  • పెద్దమనుషులతో మంతనాలు 
  • అభివృద్ధి పనులకు డబ్బు ఇస్తామని ఆశ..
  • 50 లక్షల నుంచి కోటి దాకా పెట్టేందుకు ముందుకు
  • బాండ్​పేపర్లు, డిపాజిట్​ పెట్టాలంటున్న గ్రామపెద్దలు
  • ఏకగ్రీవాలకు నజరానాలు ప్రకటిస్తున్న నేతలు
  • సిరిసిల్ల జిల్లా రూప్లానాయక్ తండాలో సర్పంచ్‌‌‌‌గా జవహర్ నాయక్‌‌‌‌ను ఏకగ్రీవం చేస్తూ తీర్మానం

హైదరాబాద్/ ఖమ్మం, వెలుగు:  గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలు కాగా.. ఏకగ్రీవానికి ఆఫర్స్​ వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఎలక్షన్​ షెడ్యూల్ విడుదల కావడం, మొదటి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా రానుండడంతో సర్పంచ్​ పదవులపై కన్నేసిన ఆశావాహులు రంగంలోకి దిగారు. పోటీ వద్దంటూ ఏకగ్రీవాల కోసం బేరసారాలు మొదలుపెట్టారు. గ్రామంలో గుడి, బడిలాంటి అభివృద్ధి పనులకు పెద్దమొత్తంలో డబ్బులిస్తామని ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఆనుకొని ఉన్న జనరల్​ పంచాయతీల్లో సర్పంచ్​పదవులకు మస్త్​ డిమాండ్​ఉన్నది. ఆయాచోట్ల రూ.50 లక్షల నుంచి రూ. కోటి దాకా పెట్టేందుకు ఆశావహులు ముందుకు వస్తున్నారు.  మరోవైపు ఏకగ్రీవ పంచాయతీలకు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లోంచి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా ఇస్తామని ప్రజాప్రతినిధులు కూడా ప్రకటిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాకముందే రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం రూప్లా నాయక్ తండాలో సర్పంచ్‌‌‌‌‌‌‌‌గా జవహర్ నాయక్‌‌‌‌‌‌‌‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ ఆ గ్రామస్తులంతా తీర్మానం చేశారు. 

ఎవరు ఎక్కువ ఇస్తే వారే..

 మొదటి విడత ఎలక్షన్లు జరిగే మండలాల్లో గురువారం నామినేషన్లు ప్రారంభం కానుండడంతో ఏకగ్రీవాలపై అభ్యర్థులతోపాటు పార్టీలు కూడా దృష్టిపెట్టాయి. చాలాకాలంగా సర్పంచ్ కావాలని ఆశపడి, రిజర్వేషన్ కలిసి రాకపోవడం వల్ల ఎలక్షన్లకు దూరంగా ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండడం వల్ల పోటీ చేయలేకపోయిన వాళ్లు ఇప్పుడు సర్పంచ్​ కుర్చీ దక్కించుకోవాలని ప్లాన్​ చేస్తున్నారు. తమను ఏకగ్రీవంగా గెలిపిస్తే గ్రామాభివృద్ధికి సొంత నిధులు ఖర్చు చేస్తామని ఆయా గ్రామాల్లోని పెద్ద మనుషుల ముందు ప్రపోజల్స్ పెడుతున్నారు. గ్రామంలోని గుడి, బడి అభివృద్ధి కోసం డబ్బులిస్తామని ప్రతిపాదిస్తున్నారు. ఎవరూ పోటీచేయకుండా చర్చించి ఒప్పించాలని, తీర్మానం చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో గ్రామాభివృద్ధికి ఎక్కువ నిధులు ఎవరు ఇస్తే వారినే సర్పంచ్‌‌‌‌‌‌‌‌గా అంగీకరిస్తామని కొన్నిచోట్ల గ్రామపెద్దలు తేల్చిచెబుతున్నారు. నామినేషన్ల ఉప సంహరణ ముగిసే వరకు ఏకగ్రీవాల కోసం ఈ బేరసారాలు జరిగే అవకాశముంది. చాలా గ్రామాల్లో నోటిమాటగా ప్రకటనలు చేస్తే కుదరదని, రూ.100  బాండ్​ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రాసివ్వాలని ఆశావహులను గ్రామస్తులు డిమాండ్​చేస్తున్నారు. మరికొన్ని చోట్ల గ్రామాభివృద్ధి కోసం కేటాయించే డబ్బును ముందుగా బ్యాంకు అకౌంట్‌‌‌‌‌‌‌‌లో డిపాజిట్​చేస్తేనే ఏకగ్రీవానికి తీర్మానం చేస్తామని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే సర్పంచ్​ సీటుపై కన్నేసిన ఆశావహులు డబ్బులు సమకూర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్లాట్ అమ్ముతామని కొందరు, తాకట్టు రిజిస్ట్రేషన్​ చేస్తామని ఇంకొందరు, డబ్బులు సర్దుబాటు చేయాలంటూ బంధువులు, సన్నిహితుల వెంట పడ్తున్నారు.

జనరల్​ స్థానాల్లో మస్త్​ డిమాండ్​..

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో 37  గ్రామ పంచాయతీలుండగా జనరల్‌‌‌‌‌‌‌‌కు 9, జనరల్ మహిళకు 9 చొప్పున సర్పంచ్​ స్థానాలు కేటాయించారు. దీంతో ఈ జనరల్ స్థానాల్లోనూ ఏకగ్రీవాల కోసం ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖమ్మం నగరాన్ని  ఆనుకొని ఉన్న మండలం కావడంతో.. ఈ గ్రామాల్లో సర్పంచ్ పదవుల కోసం రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు చేసేందుకు పలువురు ఆశావహులు ముందుకు వస్తున్నారు.  కరీంనగర్, వరంగల్​, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లాంటి కార్పొరేషన్లతోపాటు జిల్లాకేంద్రాలను ఆనుకొని ఉన్న మండలాల్లో, మేజర్​ పంచాయతీల్లో ఇదే పరిస్థితి ఉంది. ప్రధానంగా జనరల్​స్థానాల్లో అభ్యర్థులు సర్పంచ్​పదవులకోసం కోటి దాకా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్తున్నారు. ఎలాగూ పోటీ చేస్తే ప్రచారం, పంపిణీకి కోటి రూపాయలు ఖర్చుపెట్టాలని, అందుకు బదులు గ్రామాభివృద్ధికే ఆ నిధులిస్తే తమకు పేరు వస్తుందని, ఆ తర్వాత ప్రజల నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండదని సన్నిహితులతో చెప్తున్నట్లు తెలిసింది. 

ప్రజాప్రతినిధుల ఆఫర్లు.. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2019 లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు లేకుండా సర్పంచ్​ పదవులను ఏకగ్రీవం చేసుకుంటే చిన్న పంచాయతీలకు  రూ. 10 లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ. 15 లక్షలు ఇస్తామని అప్పట్లో సీఎం హోదాలో కేసీఆర్​, మంత్రి హోదాలో కేటీఆర్ ప్రకటించారు. దీంతో ఆ పైసలతో ఊరిని అభివృద్ధి చేసుకోవచ్చని వందలాది గ్రామాలు, ముఖ్యంగా తండాల్లో అక్కడ ప్రజలు సర్పంచ్​లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  కానీ నాలుగేండ్లు ఎదురుచూసినా నాటి కేసీఆర్​ సర్కారు నుంచి ఒక్కరూపాయి కూడా రాకపోవడంతో నిరాశచెందారు. ప్రస్తుత కాంగ్రెస్​ ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు ఎలాంటి నజరానా ప్రకటించలేదు. ఏకగ్రీవాల కంటే ప్రజాస్వామ్యంగా ఎన్నికలు నిర్వహించడమే మేలని ఉన్నతాధికారులు సైతం భావిస్తున్నట్లు తెలిసింది.  కానీ, అదే సమయంలో పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటే తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లోంచి నజరానా ఇస్తామని ప్రజాప్రతినిధులు ప్రకటిస్తున్నారు. ఏకగ్రీవం అయిన గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తుంది  అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ నెల 21న ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ‘‘ప్రజలందరూ చర్చించుకుని సర్పంచ్‌‌‌‌‌‌‌‌లను ఏకగ్రీవంగా  ఎన్నుకుంటే రూ.10 లక్షల చొప్పున అందజేస్తాం” అని అనౌన్స్​ చేశారు. దీంతో ఆయన సెగ్మెంట్​లోని చాలా గ్రామాల్లో  ఏకగ్రీవాలపై దృష్టిపెట్టినట్టు చర్చ నడుస్తున్నది.  తాజాగా కరీంనగర్​ జిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం ఇలాంటి ఆఫర్​ ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా ఏకగ్రీవం చేస్తే..  గ్రామ అభివృద్ధికి తన ఎంపీ లాడ్స్‌‌‌‌‌‌‌‌ నిధుల్లోంచి రూ. 10 లక్షలు ఇస్తానని ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు.   

 ఏకగ్రీవం కోసం మంతనాలు

ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం కొత్త తండాలో ధారావత్ మంగీలాల్ అనే వ్యక్తి..  గ్రామంలో ఆంజనేయ స్వామి గుడికి 3 గుంటల స్థలం ఇవ్వడంతోపాటు ఆలయం నిర్మించి ప్రతిష్ట మహోత్సవాలు సైతం నిర్వహించాడు. ఇందుకు సుమారు రూ.25 లక్షలు ఖర్చు చేశాడు. 623 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో మంగీలాల్‌‌‌‌‌‌‌‌ను సర్పంచ్‌‌‌‌‌‌‌‌గా ఏకగ్రీవం  చేసుకోవాలని ఏడాది క్రితమే గ్రామస్తులు నిర్ణయించారు. గతంలో కూడా ఈ పంచాయతీ ఏకగ్రీవమే. ఇదే మండలంలోని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య స్వగ్రామమైన టేకులగూడెం గ్రామపంచాయతీ కూడా ఏకగ్రీవం చేసేందుకు గ్రామస్తుల మధ్య మంతనాలు జరుగుతున్నాయి. గతంలో ఈ గ్రామపంచాయతీ కూడా ఏకగ్రీవమే. కొత్త కమలాపురం గ్రామ పంచాయతీ ఎస్టీ మహిళకు రిజర్వ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ గ్రామ పంచాయతీలో ఇద్దరు మాత్రమే ఎస్టీ మహిళలున్నారు. ఇక్కడ కూడా పోటీ లేకుండా ఏకగ్రీవం చేసేందుకు గ్రామ పెద్దలు ప్రయత్నం చేస్తున్నారు.   

రూప్లా నాయక్‌‌‌‌‌‌‌‌ తండా జీపీ ఏకగ్రీవానికి తీర్మానం 

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని రూప్లా నాయక్ తండా సర్పంచ్‌‌‌‌‌‌‌‌గా జవహర్ నాయక్‌‌‌‌‌‌‌‌ను ఏక గ్రీవం చేసుకోవాలని గ్రామస్తులంతా బుధవారం తీర్మానం చేశారు. 200 మంది జనాభా ఉన్న ఈ తండాలో100 శాతం గిరిజనులే కావడంతో సర్పంచ్​పదవి ఎస్టీకి రిజర్వ్​అయింది. దీంతో పార్టీలకతీతంగా గ్రామపంచాయతీ వద్ద బుధవారం సమావేశమైన గ్రామస్తులు జవహర్​నాయక్‌‌‌‌‌‌‌‌ను సర్పంచ్​గా చేసుకోవాలని తీర్మానం చేశారు.  మొదటి నుంచి గ్రామస్తులకు ఏ సమస్య వచ్చినా అండగా ఉండడం, అధికారులు, నాయకులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించడం చేసేవాడని, అందుకే జవహర్​నాయక్‌‌‌‌‌‌‌‌ను తమ సర్పంచ్‌‌‌‌‌‌‌‌గా ఎన్నుకున్నామని తండావాసులు తెలిపారు. కాగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి ఏకగ్రీవ పంచాయతీగా రూప్లానాయక్‌‌‌‌‌‌‌‌  తండా నిలవడం విశేషం.

రూ. 15 లక్షలు ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని ఓ గ్రామ పంచాయతీలో గుడి కడుతున్నారు. ఏండ్లుగా సర్పంచ్​ కావాలని ఆశపడుతున్న ఓ పెద్దాయన రెండ్రోజుల క్రితం గ్రామస్తుల ముందు ఏకగ్రీవం ప్రతిపాదన పెట్టాడు. తనను గెలిపిస్తే గుడి నిర్మాణానికి సొంతంగా రూ.15 లక్షలు ఇస్తానని ఆఫర్​ ఇచ్చాడు. పోలీస్​ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ లో ఉద్యోగం చేస్తున్న ఇద్దరు కుమారులు కూడా తండ్రి కోరిక తీర్చేందుకు తమ వంతు ప్రయత్నా లు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఆ గ్రామంలో మరో ఇద్దరు కూడా ఇలాంటి ఆఫర్లతో ముందుకొచ్చా రు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నందున ఒకట్రెం డు రోజుల్లో ఏకగ్రీవంపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తున్నది. 

గత ఎన్నికల్లో 1,935 ఏకగ్రీవాలు

పంచాయతీ రాజ్ శాఖ అధికారిక లెక్కల ప్రకారం 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,935 గ్రామ పంచాయతీ లు ఏకగ్రీవం అయ్యాయి.  ఇందులో ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 162 అయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, నిర్మల్, నల్గొండ, వరంగల్ రూరల్ జిల్లాలు ఉన్నాయి.