పైసలు కట్టినా ప్రొసీడింగ్స్ ఇవ్వట్లే... ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల నిర్లక్ష్యం

పైసలు కట్టినా ప్రొసీడింగ్స్ ఇవ్వట్లే... ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల నిర్లక్ష్యం
  • చార్జీలు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ.. అప్రూవల్ లో లేదు 
  • ఎల్–1 ఆఫీసర్  వద్ద పెండింగ్ లో ఉన్నట్లు చూపుతున్న 4 లక్షలకుపైగా అప్లికేషన్లు 
  • దరఖాస్తుదారులు వెళ్లి అడిగినా స్పందన అంతంత మాత్రమే


కరీంనగర్, వెలుగు: నాన్  లేఔట్  వెంచర్లలోని ప్లాట్ల రెగ్యులజేషన్ కు డబ్బులు చెల్లించి నెలలు గడుస్తున్నా.. అప్రూవ్  చేయడంలో టౌన్  ప్లానింగ్  ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్  చార్జీలు చెల్లించిన ప్లాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అప్రూవ్  చేయకపోవడంతో ప్రొసీడింగ్  కాపీలు జనరేట్  కావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ల్యాండ్  రెగ్యులరైజేషన్  స్కీమ్(ఎల్ఆర్ఎస్) 2020 కింద సుమారు 7 లక్షల మంది చార్జీలు చెల్లిస్తే 4 లక్షలకుపైగా పెండింగ్ లో ఉన్నట్లు తెలిసింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్  నెలల్లో ‘ఎల్ఆర్ఎస్  చార్జీలు చెల్లించండి’ అంటూ ఫోన్లు చేసి మరీ వెంటపడిన ఆఫీసర్లు.. ఇప్పుడు దరఖాస్తుదారులను ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటున్నారు.

ఎల్ఆర్ఎస్  చార్జీలు చెల్లించిన దరఖాస్తుదారు వెళ్లి అడిగితే తప్ప.. సదరు అప్లికేషన్ ను ప్రాసెస్  చేయడం లేదనే విమర్శలున్నాయి. 
చార్జీలు వసూలు చేయడం వరకే.. అనధికార లేఔట్లలోని ప్లాట్ల రెగ్యులరైజేషన్  కోసం 2020లో రాష్ట్రవ్యాప్తంగా 25,67,107 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. అయితే వీటిని త్వరగా క్లియర్  చేసేందుకు, ప్లాట్ల ఓనర్లకు భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం రాయితీ ప్రకటించింది. 

ఈ రాయితీతో ఎల్ఆర్ఎస్ కు అర్హత కలిగిన 20.15 లక్షల దరఖాస్తులకు ఫీజు ఇంటిమేషన్  లెటర్లు జనరేట్  అయ్యాయి. కుంటలు, చెరువులు, ప్రొహిబిటెడ్‌‌‌‌ ల్యాండ్స్  పరిధిలో ఉన్న మిగతా అప్లికేషన్లు ప్రొహిబిటెడ్  జాబితాలో చేర్చారు. మార్చి, ఏప్రిల్  నెలల్లో వివిధ మున్సిపాలిటీల్లో కాల్  సెంటర్లు, హెల్ప్  డెస్కులు పెట్టి దరఖాస్తుదారుల అనుమానాలు నివృత్తి చేసిన టౌన్  ప్లానింగ్  ఆఫీసర్లు.. వీలైనంత ఎక్కువ మందితో ఎల్ఆర్ఎస్  చార్జీలు కట్టించేందుకు ప్రయత్నించారు. ఇలా ఇప్పటి వరకు 7 లక్షల మంది ఫీజు చెల్లించగా, సుమారు రూ‌‌‌‌‌‌‌‌.2,350 కోట్ల ఆదాయం సమకూరింది. 

మరో 13 లక్షల ప్లాట్లకు ఫీజు చెల్లించాల్సి ఉంది.  అయితే చార్జీల వసూళ్లలో ఉన్న శ్రద్ధ ఇప్పుడు కనిపించడం లేదనే విమర్శలున్నాయి. డబ్బులు చెల్లించిన ప్లాట్ల ఓనర్లు స్వయంగా వెళ్లి ప్రొసిడింగ్  కాపీ జనరేట్  అయ్యేలా చూడాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ప్లాట్  దగ్గరికి రేపు వస్తాం.. ఎల్లుండి వస్తాం అంటూ జాప్యం చేస్తున్నారని దరఖాస్తుదారులు వాపోతున్నారు. దీంతో 4 లక్షలకుపైగా అప్లికేషన్లు ఎల్–1 ఆఫీసర్  వద్ద పెండింగ్ లో ఉన్నట్లు చూపుతున్నాయి.

మూడు శాఖల మధ్య సమన్వయ లోపంతోనేనా ? 

ఆటోమెటిక్ గా ఎల్ఆర్ఎస్  ఫీజు ఇంటిమేషన్  లెటర్లు జారీ అయినందున.. ఫీజు చెల్లించాక ఆ ప్లాట్లను, ప్లాట్  కాగితాలను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంది. ప్లాట్  దగ్గరికి వెళ్లి ఫొటో తీసుకుని ఆ ప్లాట్  నిషేధిత జాబితాలో గానీ, చెరువులు, కుంటల్లో లేదని నిర్ధారించుకోవాల్సి ఉంది. 

ఇందుకోసం టౌన్  ప్లానింగ్ తోపాటు ఇరిగేషన్, రెవెన్యూ ఆఫీసర్లు కూడా వెళ్లాల్సి ఉంటుంది.  ఈ మూడు శాఖల ఆఫీసర్ల మధ్య సమన్వయ లోపం, ఒకరికి వీలైనప్పుడు మరొకరికి వీలు కాకపోవడం, తమ సొంత శాఖ పనులు ఉండడంతో అప్లికేషన్లు చాలా వరకు ఎల్–-1లోనే పెండింగ్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది.