ఊర్లో ఉన్నోళ్లను కాదని.. లేనోళ్లకు  దళితబంధు ఇస్తరా?

ఊర్లో ఉన్నోళ్లను కాదని.. లేనోళ్లకు  దళితబంధు ఇస్తరా?
  • వాసాలమర్రిలో ఆఫీసర్లను నిలదీసిన దళితులు
  •  అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపణలు

తుర్కపల్లి, వెలుగు: సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో ఆఫీసర్లు, సర్పంచ్ అవకతవకలకు పాల్పడుతున్నారని దళితులు ఆరోపించారు. ఊర్లో ఉన్నవారికి కాకుండా 50 ఏండ్ల కింద హైదరాబాద్ వలసపోయిన కుటుంబాలకు ఎట్లా ఇస్తారని నిలదీశారు. తమకు సన్నిహితంగా ఉండే కుటుంబాల్లో నలుగురైదుగురు అన్నదమ్ములు ఉంటే అందరికీ ఇచ్చి.. మిగతా కుటుంబాల్లో అన్నదమ్ములకు మాత్రం అట్ల ఎందుకివ్వడం లేదని అడిగారు. మంగళవారం వాసామర్రిలోని రైతువేదికలో దళితబంధు లబ్ధిదారులతో ఆఫీసర్లు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఊర్లో ఉన్న దళితులకు ఇవ్వకుండా, 50 ఏండ్ల కింద ఊరు విడిచిపోయిన కుటుంబాలకు మొదటి విడతలోనే ఎట్ల స్కీం వర్తింపజేస్తారని సర్పంచ్, ఆఫీసర్లను దళితులు నిలదీశారు. దీంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ప్రతి ఒక్కరికి దళితబంధు వర్తింపజేస్తామని, ఎవరూ అధైర్య పడొద్దని ఆఫీసర్లు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. వాసాలమర్రిలో దళితబంధు అర్హులు 76 మంది ఉండగా, 66 మంది ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున డిపాజిట్ చేశారు. ఆధార్ కార్డ్, కొన్ని పేపర్లు ఇవ్వలేదని 10 మందికి డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు క్రెడిట్ అయిన 66 మందిలో కొందరు దశాబ్దాల కిందనే హైదరాబాద్ వలసపోయారని, డబ్బులు పడని 10 మంది ఊరిలోనే ఉంటున్నా వారికి ఇవ్వలేదని ఆరోపించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్ దళితబంధు అమలులో అవకతవకలకు పాల్పడుతున్నారని ఆందోళన చేశారు. డబ్బులు పడని వారు మాట్లాడుతూ.. ఆఫీసర్లు అడిగిన అన్ని పేపర్లు ఇచ్చామని, డబ్బులు అకౌంట్​లో వేయాలని కోరారు. శ్యాంసుందర్, సర్పంచ్ పోగుల ఆంజనేయులు మాట్లాడుతూ.. దళితబంధు లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా చేశామని, ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. డబ్బులు పడని 10 మంది లబ్ధిదారులకు పది రోజుల లోపు అమౌంట్ క్రెడిట్ అవుతుందని తెలిపారు.