ఎమ్మార్వో విజయారెడ్డిని కాపాడబోయిన రైతుకూ న్యాయం చేయని అధికారులు

ఎమ్మార్వో విజయారెడ్డిని కాపాడబోయిన రైతుకూ న్యాయం చేయని అధికారులు

మంటల్లో గాయపడి రూ.12 లక్షలు ఖర్చు..

ఆస్పత్రి ఖర్చులూ ఎవరూ ఇవ్వలేదు 

మూడేళ్లుగా పాస్ బుక్కు కోసం తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు 

అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో ఆఫీసు వద్ద ధర్నా కు దిగిన  రైతు నారాయణ

రంగారెడ్డి: దేశ వ్యాప్తంగా కలకలం రేపిన ఎమ్మార్వో విజయారెడ్డి సజీవ దహనం ఘటనలో మానవత్వం చాటిన రైతు కుటుంబానికి రెవెన్యూ అధికారులు న్యాయం చేయడం లేదు. మూడేళ్లుగా పట్టాదారు పాస్ బుక్కు కోసం తిరుగుతున్న నారాయణ.. విజయారెడ్డి సజీవ దహనం ఘటన తర్వాతైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తే.. ఏడాదైనా ఎవరూ పట్టించుకోకపోవడంతో విసిగిపోయాడు. ఇవాళ  అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో కార్యాలయం ముందు కుటుంమ సభ్యులతో కలిసి నిరసన చేపట్టాడు.

గత ఏడాది క్రితం పాసు పుస్తకం కోసం వచ్చి ఎమ్మార్వో విజయరెడ్డి సజీవ దహనం చేస్తుంటే.. మంటల్లో కాలిపోతున్న ఆమెను రైతు నారాయణ కాపాడబోయి మంటల్లో గాయపడ్డాడు. చికిత్స కోసం రూ.12 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. విజయారెడ్డిని ప్రాణాలతో కాపాడలేకపోయినా.. రైతు నారాయణ ప్రయత్నం మానవత్వాన్ని చాటిందంటూ చాలా మంది ప్రశంసించారు.  ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే వెళ్లి పరామర్శించారు. ఈ ఘటనతోనైనా రైతుకు వెంటనే పాస్ బుక్కు ఇస్తారని భావిస్తే.. రెవెన్యూ అధికారులు అదేరీతిలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. విజయారెడ్డి సజీవ దహనం ఘటన  జరిగి ఏడాదైనా తనను గుర్తు పడుతున్న రెవెన్యూ అధికారులు.. సిబ్బంది ఎవరూ చొరవ తీసుకుని తనకు న్యాయం చేయడం లేదని రైతు నారాయణ వాపోయాడు. ఏం చేయాలో తెలియక తనకు.. తన కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్వో కార్యాలయంలో నిరసన ప్రారంభించాడు.