సీఎం సభకు డాక్టర్లు, స్టాఫ్​ వెళ్లాలి..ఆర్డర్స్​జారీ చేసిన డీఎంహెచ్‌‌వోలు

సీఎం సభకు డాక్టర్లు, స్టాఫ్​ వెళ్లాలి..ఆర్డర్స్​జారీ చేసిన డీఎంహెచ్‌‌వోలు

హైదరాబాద్, వెలుగు: నిమ్స్ హాస్పిటల్ విస్తరణ పనులకు ఈ నెల 14న సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. అనంతరం అక్కడే బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు కొత్తగా రిక్రూట్‌‌ అయిన డాక్టర్లు, రెగ్యులరైజేషన్‌‌ అయిన హెల్త్ స్టాఫ్ అందరూ తప్పకుండా హాజరు కావాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 9 గంటలకల్లా సభా ప్రాంగణం వద్ద ఉండాలని అన్ని జిల్లాల డీఎంహెచ్‌‌వోలు సోమ వారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌‌, చుట్టు పక్కల ఉన్న ప్రతి ప్రభుత్వ హాస్పిటల్ నుంచి 20 మందికి తక్కువ కాకుండా సభకు హాజరు అవాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే, పేషెంట్లను, డ్యూటీలను వదిలి సీఎం సభకు వెళ్లాలని ఒత్తిడి చేయడమేంటని డాక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, సభా ప్రాంగణం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి హరీశ్‌‌రావు సోమవారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం నిమ్స్‌‌లో చికిత్స పొందుతున్న జానపద గాయకుడు గిద్దె రామ నరసయ్యను మంత్రి పరామర్శించారు. నరసయ్యను మంచిగ చూసుకోవాలని నిమ్స్‌‌ డైరెక్టర్ బీరప్పకు మంత్రి సూచించారు. అంతకుముందు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ హాస్పిటళ్ల పనితీరుపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌‌ నిర్వహించారు. కొత్త డాక్టర్లకు, మెడికోలకు ఆదర్శంగా సీనియర్ల పనితీరు ఉండాలని మంత్రి హెచ్చరించారు.