- ఇన్చార్జి చిన్నారెడ్డితో భేటీ
హైదరాబాద్సిటీ, వెలుగు: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో నిర్వహిస్తున్న సీఎం ప్రజావాణిని రాష్ట్రంలోని వివిధ శాఖల అధికారుల బృందం మంగళవారం సందర్శించింది. రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన ఆయా శాఖల అధికారులు ప్రస్తుతం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రజావాణి ఇన్చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డితో అధికారులు భేటీ అయ్యారు.
ప్రజావాణి అమలు తీరును, ప్రజల సమస్యల పరిష్కారంలో అనుసరిస్తున్న పద్ధతిని అడిగి తెలుసుకున్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతామని అధికారులు ప్రకటించారు. సీఎం ప్రజావాణి సమన్వయ అధికారులు రాకేశ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, లక్ష్మినారాయణ పాల్గొన్నారు.
132 దరఖాస్తులు వచ్చాయి: చిన్నారెడ్డి
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణికి 132 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 41, రెవెన్యూ శాఖకు సంబంధించి 29, హోం శాఖకు 10, ఇందిరమ్మ ఇండ్ల కోసం 31, ప్రవాసి ప్రజావాణికి 02 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 19 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.
