హైదరాబాద్, వెలుగు: నాగోలు, మియాపూర్ మెట్రో స్టేషన్లలో పార్కింగ్‌ఫీజు వసూలు చేయనున్నట్లు ఎల్అండ్ టీ, హెచ్ఎంఆర్ఎల్ అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ స్టేషన్లలో ఫ్రీ పార్కింగ్ అమలులో ఉంది. త్వరలో ఫ్రీ పార్కింగ్‌ను ఎత్తివేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 25 నుంచి నాగోలు మెట్రో స్టేషన్ లో, సెప్టెంబర్ ఒకటి నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ లో పార్కింగ్ ఫీజు అమలు చేయబోతున్నట్లు మెట్రో అధికారులు బుధవారం ప్రకటించారు.
పైలెట్ రన్ గా బుధవారం నాగోలు మెట్రో స్టేషన్ వద్ద పెయిడ్ పార్కింగ్ అమలు చేసినట్లు పేర్కొన్నారు. అయితే ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో బుధవారం ఉదయం మెట్రో సిబ్బందితో ప్యాసింజర్లు వాగ్వాదానికి దిగారు. ఇన్నేళ్లు లేనిది కొత్తగా పార్కింగ్‌ఫీజు వసూలు చేయడమేమిటని ప్రశ్నించారు. అయినప్పటికీ మెట్రో సిబ్బంది పార్కింగ్‌ఫీజు వసూలు చేశారు.
స్టేషన్ ఆవరణలో ఫీజుల వివరాలతో బోర్డులు ఏర్పాటు చేశారు. వాటిని ప్యాసింజర్లు చించేసి నిరసన తెలిపారు. టూ వీలర్‌కు(2 గంటల వరకు) రూ. 10; 8 గంటల వరకు రూ.25; 12 గంటల వరకు రూ.40 వసూలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. 12 గంటలు మించితే ప్రతీ గంటకు రూ.5రూపాయలు చెల్లించాలి. ఫోర్‌వీలర్‌కు అయితే 2 గంటల వరకు రూ.30; 8 గంటల వరకు రూ.75; 12 గంటల వరకు రూ.120; ఆపైన ప్రతిగంటకు అదనంగా రూ.15 చొప్పున వసూలు చేయనున్నారు.
