శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పరవళ్లు

శ్రీశైలం జలాశయానికి  కృష్ణమ్మ పరవళ్లు

రెండు రోజుల  నుంచి  వర్షం తగ్గడంతో  ప్రాజెక్టులకు వరద ప్రభావం తగ్గతూ వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వారం పాటు  కురిసిన వర్షాలు ప్రజలను అతలాకుతలం చేశాయి. ఎగువన  కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు ఉధృతంగా ప్రవహించాయి. పలు గ్రామాలు  నీట మునిగాయి. దీంతో ప్రజలు  తీవ్రంగా నష్టపోయారు. అయితే ప్రస్తుతం ప్రాజెక్టులకు  వరద ప్రవాహం తగ్గిందని అధికారులు తెలిపారు.

సింగూరు ప్రాజెక్టుకు  వరద ప్రవాహం  తగ్గింది. ప్రాజెక్టు   పూర్తిస్థాయి నీటి సామర్ధ్యం  29  టీఎంసీలు  కాగా   ప్రస్తుత నీటి మట్టం 24  టీఎంసీలు  ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇన్ ఫ్లో  14 వేల 207 క్యూసెక్కులు  వస్తుండగా.. ఔట్ ఫ్లో  400 క్యూసెక్కులు ఉంది. నిర్మల్ జిల్లా  కడెం ప్రాజెక్టుకు కూడా వరద ఉధృతి తగ్గింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం 700 అడుగులు  కాగా, ప్రస్తుతం 679 అడుగుల నీరు ఉంది. ప్రాజెక్టుకు 12 వేల 354  క్యూసెక్కుల ఇన్ ఫ్లో  వస్తుండగా.. ఔట్ ఫ్లో16 వేల  815 క్యూసెక్కులుగా ఉంది. 

గంట గంటకు పెరుగుతున్న ఇన్ ఫ్లో

శ్రీశైలం జలాశయానికి  కృష్ణమ్మ పరవళ్లు  తొక్కుతోంది. గంట గంటకు ఇన్ ఫ్లో పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి లక్షా 71 వేల 731 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది. అలాగే సుంకేసుల నుంచి లక్షా 59 వేల 674 క్యూసెక్కుల నీరు చేరుతోంది. మొత్తం శ్రీశైలం జలాశయానికి 3లక్షల 67 వేల 698 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.  ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి  సామర్ధ్యం  885 అడుగులు కాగా  ప్రస్తుతం 848.30  అడుగుల  నీటి మట్టం ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఇన్ ఫ్లో 3 లక్షల  67 వేల 698  క్యూసెక్కులు కాగా..అలాగే ఔట్ ఫ్లో 12 వేల 714 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఇప్పటికే విద్యత్ ఉత్పత్తి మొదలవ్వగా కుడి గట్టు జల విద్యుత్ కేంద్రంలో ఇంకా ప్రారంభం కాలేదని అధికారులు తెలిపారు. 

లక్ష్మీ బ్యారేజ్ కు వరద ఉధృతి తగ్గింది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో16 లక్షల 71 వేల  388 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో  కూడా 16 లక్షల 71 వేల 388 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు  పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 100  మీటర్లు కాగా  ప్రస్తుతం100 మీటర్ల మేర వరద నీరు చేరింది. అలాగే  శ్రీపాద ఎల్లంపల్లి  ప్రాజెక్టుకు  కూడా వరద ప్రవాహం తగ్గింది. ప్రాజెక్టు  పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16 టీఎంసీల నీరు ఉంది. ఇన్ ఫ్లో ఒక లక్షా 74 వేల 908  క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో ఒక లక్షా 46 వేల 880  క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.