
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ OG (ఓజీ) సినిమా స్టోరీని ఆయనకు తెలియకుండానే లీక్ చేసినట్టయింది. ‘ఖటానా’ (కత్తి) చుట్టూ కథ అల్లి సినిమాను రంజింపజేసేలా సుజిత్ చాలా బాగా OG సినిమా తెరకెక్కించాడని పవన్ చెప్పారు. అంటే.. ఈ సినిమాలో ‘ఖటానా’కు ఎంత ఇంపార్టెన్స్ ఉందో పవన్ పరోక్షంగా చెప్పినట్టయింది. ఈ విషయంతో పాటు ప్రియాంక మోహన్ పాత్ర నిడివి కూడా తక్కువ సేపే ఉంటుందని పవన్ చెప్పడంతో.. ఆమె పాత్రను డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాలో ఎమోషన్ కోసం చంపేసి ఉండొచ్చనే అనుమానాలు మరింత బలపడ్డాయి. ఈ రెండు విషయాలను పవన్ ఆయనకు తెలియకుండానే బయటకు చెప్పినట్లయింది.
పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్‌లో డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రం ‘ఓజీ’. సెప్టెంబర్ 25న వరల్డ్‌వైడ్‌గా సినిమా రిలీజ్ కానుంది. ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘అభిమానులను అలరించడానికి నేను దేనికైనా సిద్ధం. ఈ సినిమాలో ‘వాషి యో వాషి’ అనే సాంగ్ పాడాను. ఇదొక జపనీస్ పొయెం. ‘ఓజీ’తో పెట్టుకుంటే చావు ఎంత బలంగా ఉంటుందో చెప్పడమే ఈ పాట ఉద్దేశం. ఇమ్రాన్ హష్మీ లాంటి బ్రిలియెంట్ పెర్ఫార్మర్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉంది.
సుజీత్ నా అభిమాని. ఆ అభిమానంతోనే నాతో సినిమా చేశాడు. ‘సాహో’ తర్వాత త్రివిక్రమ్ నాకు తన గురించి చెప్పాడు. ఈ చిత్రాన్ని సుజీత్ చాలా బాగా తీశాడు. ఆయనకు తోడు తమన్ హై ఎనర్జీ ఇచ్చాడు. నన్ను కూడా వీళ్ల దారిలోకి లాగేశారు. ఈరోజు నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను. అంతలా నన్ను మార్చేశారు. ఈ గెటప్, ఇలా కత్తి పట్టుకురావడం సినిమాల్లోనే చెల్లుతుంది. ప్రియాంకతో స్ర్కీన్ షేరింగ్ కాసేపే ఉన్నా చాలా బ్యూటీఫుల్‌గా ఉంటుంది.
‘ఖుషి’ టైమ్‌లో ఇలాంటి జోష్ చూశా. సినిమాలు వదిలేసి పాలిటిక్స్‌కు వెళ్లినా.. నాకు భవిష్యత్తు ఇచ్చిన అభిమానుల కోసం తిరిగొచ్చా. ఈ సినిమాకోసం జపనీస్ రాకపోయినా నేర్చుకున్నా. సుజీత్ దగ్గర ఉన్న టీమ్ నేను డైరెక్షన్ చేసే టైమ్‌లో ఉంటే పాలిటిక్స్‌కు వచ్చే వాడిని కాదేమో’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు డీవీవీ దానయ్య, అల్లు అరవింద్, హీరోయిన్స్ ప్రియాంక అరుళ్ మోహన్, శ్రియా రెడ్డి, నటులు ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్ పాల్గొన్నారు.