హైదరాబాద్, వెలుగు: టీజీ ఆయిల్ ఫెడ్ భూములను దోచుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ధ్వజమెత్తారు. సోమవారం హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద మాట్లాడిన ఆయన.. 1954లో ఆయిల్ ఉత్పత్తి అవసరాల కోసం 17,261 గజాల భూమిని ఓ ప్రైవేట్ వ్యక్తికి కేటాయించగా, ఇతర అవసరాలకు లీజుకు ఇచ్చినందుకు 1974లో ఆ కేటాయింపును రద్దు చేశారని, అనంతరం 1990లో అందులోని 15,983 గజాల భూమిని ఆయిల్ ఫెడ్ కు కేటాయించారని గుర్తుచేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఆయిల్ ఫెడ్ ను అక్కడి నుంచి ఖాళీ చేయించే కుట్ర చేయగా, కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆ భూములు పూర్తిగా ఆయిల్ ఫెడ్ కే ఉండాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. అయితే రేవంత్ రెడ్డి మళ్లీ చంద్రబాబు బాటలోనే పయనిస్తూ, జీవో 85 ద్వారా ఈ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారన్నారు. దాదాపు17 వేల గజాల ఈ ఆయిల్ ఫెడ్ భూమిని రియల్ ఎస్టేట్ కోసం వాడుకోవాలనే పన్నాగంతోనే రేవంత్ రెడ్డి సోదరులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
