హైదరాబాద్, వెలుగు: పెరుగుతున్న సాగు ఖర్చులకు అనుగుణంగా ఆయిల్ పామ్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆయిల్ పామ్ రైతులు కోరారు. రైతులు, కంపెనీల మధ్య ప్రస్తుతం అమలవుతున్న 75:25 ఆదాయ పంపిణీ నిష్పత్తిని 80:20కి మార్చాలని లేదా ఆయిల్ పామ్ గెలలకు (ఎఫ్‌ఎఫ్‌బీ) టన్నుకు రూ.25 వేల కనీస గ్యారంటీ ధర నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం సెక్రటేరియెట్‌లో మంత్రి తుమ్మలను కలిసి తమ డిమాండ్లను వివరించారు.
ఎరువులు, కూలీల వేతనాలు, ఇతర పెట్టుబడి ఖర్చులు రెట్టింపయ్యాయని, దీనికి తోడు ఎల్‌నినో ప్రభావంతో దిగుబడులు తగ్గడంతో సాగు భారంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 80:20 ఆదాయ భాగస్వామ్య విధానాన్ని అమలు చేస్తే టన్నుకు దాదాపు రూ.1,516 అదనపు ఆదాయం లభిస్తుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రైతుల విజ్ఞప్తిపై మంత్రి తుమ్మల సానుకూలంగా స్పందించారు. ఆదాయ పంపిణీ నిష్పత్తి మార్పు అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
