- సెన్సెక్స్ 736 పాయింట్లు జంప్
- 231 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 83 డాలర్లకు దిగొచ్చిన ఆయిల్
ముంబై: అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ విరమణ ఒప్పందం కుదరడం, అంతర్జాతీయ మార్కెట్లలో ర్యాలీ, ముడి చమురు ధరల తగ్గుదల వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 736.38 పాయింట్లు పెరిగి 76,264.33 వద్ద ముగిసింది. ఒకదశలో ఇది 1,293.12 పాయింట్లు పెరిగి 76,821.07 పాయింట్లను తాకింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 231 పాయింట్లు దూసుకెళ్లి 23,853.90 వద్ద ముగిసింది.
శుక్రవారం సెషన్‌లో సెన్సెక్స్ 1,695 పాయింట్లు, నిఫ్టీ 461 పాయింట్లు పెరిగాయి. రెండు సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ.18.15 లక్షల కోట్లు పెరిగింది. బ్రెంట్ క్రూడ్ ధర 5 శాతం తగ్గి బ్యారెల్‌కు 83 డాలర్ల వద్ద ట్రేడయింది. సెన్సెక్స్ కంపెనీల్లో ట్రెంట్ 5.35 శాతం లాభపడగా, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, బజాజ్ ఫిన్‌సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్ కూడా లాభాల్లో ముగిశాయి. ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి. రంగాల వారీగా రియల్టీ 3.93 శాతం, ఆటో 2.69 శాతం పెరిగాయి. ఎఫ్ఐఐలు శుక్రవారం రూ.1,082.18 కోట్ల విలువైన షేర్లను అమ్మారు.
- 60 పైసలు పెరిగిన రూపాయి
ముడి చమురు ధరలు తగ్గడంతో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 60 పైసలు పెరిగి 94.58 వద్ద ముగిసింది. ఇది శుక్రవారం 67 పైసలు పెరిగి 95.18 వద్ద సెటిలైంది. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో లాభాలు, డాలర్ ఇండెక్స్ బలహీనపడటం రూపాయికి కలిసొచ్చాయి.
చమురు ధరల తగ్గుదల కరెంటు ఖాతా లోటు (సీఏడీ) ను తగ్గిస్తుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఆసియా మార్కెట్లలో సౌత్ కొరియా కోస్పి, జపాన్ కు చెందిన నిక్కీ 225 ఇండెక్స్ దాదాపు 5 శాతం మేర పెరిగాయి. చైనాకు చెందిన షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్, హాంగ్ కాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ కూడా లాభాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లూ లాభాల్లో ట్రేడయ్యాయి. అమెరికా మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి.
- 4 వేదాంత కంపెనీల లిస్టింగ్
మెటల్స్, మైనింగ్ కంపెనీ వేదాంత లిమిటెడ్ తన డీమెర్జర్ ప్రక్రియను పూర్తి చేసింది. కొత్తగా ఏర్పడిన నాలుగు కంపెనీలు వేదాంత అల్యూమినియం మెటల్, వేదాంత పవర్, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్, వేదాంత ఐరన్ అండ్ స్టీల్ షేర్లు బీఎస్ఈ, నిఫ్టీలలో సోమవారం లిస్ట్ అయ్యాయి.
స్పెషల్ ప్రీ-ఓపెన్ సెషన్ ద్వారా వీటి ధరల గుర్తింపు జరిగింది. ప్రారంభంలో ఈ షేర్లను ట్రేడ్ టు ట్రేడ్ (టీటూటీ) విభాగంలో ఉంచారు. మే ఒకటి రికార్డు తేదీ నాటికి వేదాంత లిమిటెడ్ లో ఒక్కో షేరు ఉన్న వాటాదారులకు కొత్త కంపెనీల షేర్లు 1:1 నిష్పత్తిలో కేటాయించారు. ఎన్ఎస్ఈలో వేదాంత అల్యూమినియం రూ.522 వద్ద, వేదాంత పవర్ రూ.41.80 వద్ద, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ రూ.38 వద్ద, వేదాంత ఐరన్ అండ్ స్టీల్ రూ.20 వద్ద ఓపెన్ అయ్యాయి.
