- ఈ ఏడాది 50 శాతం జంప్
- ఘర్షణలు కొనసాగడమే కారణం
- ఇండియా ఎకానమీపై తీవ్ర భారం
న్యూఢిల్లీ: పరిస్థితి మొదటికి వచ్చింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్ ధర ఏడు సెంట్లు (0.08 శాతం) పెరిగి 90.94 డాలర్లకు చేరింది. యూఎస్ వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్ ధర 53 సెంట్లు (0.63 శాతం) పెరిగి 85.03 డాలర్లకు చేరుకుంది. ఈ ధరలు గత నెల 31 తర్వాత అత్యధిక స్థాయికి చేరాయి. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూఎస్–-ఇరాన్ శాంతి ఒప్పందాన్ని పొడిగించకపోవడం, హార్మూజ్ జలసంధి వద్ద భద్రతాపరమైన ఆందోళనలు ఇందుకు ప్రధాన కారణాలు. యూఎస్–-ఇరాన్ తాత్కాలిక ఒప్పందం గత నెల 17న ముగిసింది.
మళ్లీ శాంతి ఒప్పందం కుదరలేదు. దీంతో ఇరాన్ దూకుడు పెంచింది. హార్మూజ్ జలసంధి నిర్వహణపై ఇరాన్ ఒమన్‌తో నేరుగా చర్చిస్తోంది. ఈ చర్చల్లో అమెరికాకు భాగస్వామ్యం లేకపోవడంతో ట్రంప్ ఒమన్‌పై మండిపడ్డారు. మిడిల్ ఈస్ట్ నుంచి చమురు సరఫరాలకు అంతరాయం కలగడంతో ఈ ఏడాది బ్రెంట్ ధర దాదాపు 50 శాతం పెరిగింది. అయినప్పటికీ గల్ఫ్ దేశాల ఉత్పత్తిదారులు సముద్ర మార్గం ద్వారానే చమురును రవాణా చేయడానికి మార్గాలను వెతుకుతున్నారు. ఒప్పందం గడువు ముగిసిన గత నెల 17 వ తేదీన 86.09 డాలర్లు ఉన్న క్రూడ్ ఆయిల్ ధర మంగళవారం నాటికి సుమారు 91 డాలర్లకు చేరింది. ఈ కాలంలో బ్యారెల్ ధర దాదాపు ఐదు డాలర్లు పెరిగింది.
ఇండియాకు దిగుమతులే దిక్కు..
భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు. తన అవసరాల కోసం 85 శాతానికి పైగా క్రూడాయిల్‌ను విదేశాల నుంచి కొంటున్నది. బ్రెంట్ ధరలు కొంచెం పెరిగినా దిగుమతి బిల్లు విపరీతంగా పెరుగుతుంది. ఐసీఆర్‌ఏ అంచనాల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో సగటు చమురు ధర బ్యారెల్‌కు 10 డాలర్లు పెరిగితే, దిగుమతుల బిల్లు 13 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,24,455 కోట్లు) ఎగబాకుతుంది. ఫలితంగా జీడీపీలో కరెంట్ అకౌంట్ లోటు 0.3 శాతం మేర అధికమవుతుంది. చమురు ధరల వల్ల రూపాయిపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. గత 12 నెలల్లో రూపాయి విలువ దాదాపు 10 శాతం బలహీనపడింది. ప్రస్తుతం 95.74 వద్ద ట్రేడవుతోంది. ఈ పతనాన్ని నియంత్రించడానికి ఆర్‌బీఐ ఫారెక్స్ మార్కెట్లో జోక్యం చేసుకుంటోంది.
ఎయిర్‌లైన్స్‌కు తీవ్ర ఇబ్బందులు
చమురు ధరల పెరుగుదల ప్రభావం విమానయాన రంగంపై చాలా ఎక్కువగా ఉంది. జెట్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ఖర్చులు విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చులో 40 శాతం వరకు ఉంటున్నాయి. ఇది ప్రపంచ సగటు 25 శాతం కంటే చాలా ఎక్కువ. అంతర్జాతీయ మార్గాల్లో ఈ భారం మరింత పెరిగింది. దీంతో ఎయిర్ ఇండియా , ఇండిగో సంస్థలు దేశీయ సర్వీసులను తగ్గించడంతో పాటు ఫ్యూయల్ సర్ ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. ఐవోసీ, బీపీసీఎల్ , హెచ్‌పీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ రిఫైనరీలు కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్నందున రిటైల్ ఇంధన ధరలను పెంచలేక ఇబ్బందిపడుతున్నాయని నిపుణులు అంటున్నారు.
