ట్రంప్ దెబ్బ.. అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేసింది

ట్రంప్ దెబ్బ..  అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేసింది
  • అమెరికా దాడులతో భగ్గుమన్న చమురు ధరలు
  • మరోసారి పెట్రోవాత షురూ
  • నాలుగు శాతంపెరిగిన క్రూడ్‌‌ ధర
  • ఫ్యూచర్స్‌‌లో రూ.700 పెరిగిన బంగారం ధర
  • రూపాయి మారక విలువ పతనం

న్యూఢిల్లీ:

అగ్రరాజ్యం అమెరికా శుక్రవారం  ఇరాన్​ మిలిటరీపై చేసిన దాడి  అంతర్జాతీయ మార్కెట్లను  కుదిపేసింది. చమురు, ఫారెక్స్‌‌, మెటల్‌‌, ఈక్విటీ మార్కెట్లపై తీవ్ర ప్రభావం కనిపించింది. తమ ఎంబసీపై దాడికి కారకుడని పేర్కొంటూ ఇరాన్‌‌ సీనియర్‌‌ మిలిటరీ కమాండర్‌‌ ఖాసిం సులేమానీ సహా మరికొందరు మిలిటరీ ఆఫీసర్లను అమెరికా ఫోర్స్ చంపేయడంతో మార్కెట్లు దెబ్బతిన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భగ్గుమన్నాయి. బంగారం ధర దూసుకెళ్లింది. రూపాయి మారకం విలువ పడిపోయింది. అమెరికా–ఇరాన్‌‌ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. అంతర్జాతీయ చమురు మార్కెట్లలో చమురు ధరలు దాదాపు నాలుగు శాతం అమాంతంగా పైకెగియడంతో ఇండియా ఆయిల్ మార్కెటింగ్‌‌ కంపెనీలు (ఓఎంసీలు) వెంటనే ధరలను పెంచేశాయి. గురువారంతోపాటు శుక్రవారమూ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్‌‌పై 10 పైసలు, లీటరు డీజిల్‌‌పై 15 పైసలు పెంచారు. వీటికి పన్నులను కలిపితే కస్టమర్‌‌ జేబుపై మరింత భారం తప్పదు. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు భారీగా పెరుగుతున్నందున, ఇక నుంచి కూడా ఓఎంసీలు ధరలను మరింత పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రెంట్‌‌ క్రూడాయిల్‌‌ బ్యారెల్‌‌ ధర 4.39 శాతం పెరిగి 69.16 డాలర్లకు చేరుకుంది. ఢిల్లీలో లీటరు పెట్రోల్‌‌ ధర రూ.75.35కు చేరింది.  కోల్‌‌కతాలో రూ. 77.94, చెన్నైలో రూ. 78.28 పలికాయి. లీటరు డీజిల్‌‌ ధర ఢిల్లీ, ముంబై, కోల్‌‌కతా, చెన్నైలో వరుసగా రూ. 68.25, రూ. 71.56, రూ. 70.61, రూ. 72.12లు పలుకుతోంది. ఇక హైదరాబాద్‌‌లో లీటరు పెట్రోల్‌‌ ధర రూ.80.12లు ఉండగా, డీజిల్‌‌ ధర రూ.74.12లకే చేరింది.

మన సెన్సెక్స్​కూ తాకింది

  • 160 పాయింట్లు డౌన్‌‌
  • 42 పైసలు నష్టపోయిన రూపాయి

కొత్త ఏడాదిలో వరుస రెండు సెషన్‌‌లలో లాభాలతో ముగిసిన స్టాక్‌‌ మార్కెట్లు, శుక్రవారం సెషన్‌‌లో నెగిటివ్‌‌లో క్లోజయ్యాయి.  బెంచ్‌‌మార్క్‌‌ సూచీలు సెన్సెక్స్‌‌ 162.03 పాయింట్లు పడిపోయి 41,464.61 పాయింట్ల వద్ద, నిఫ్టీ 55.50 పాయింట్లను నష్టపోయి 12,226.70 వద్ద క్లోజయ్యాయి.  మొత్తంగా 1257 షేర్లు నష్టాల్లో ముగియగా, 176 షేర్లలో ఎటువంటి మార్పూ లేదు. రూపాయి, డాలర్‌‌‌‌ మారకంలో బలహీనపడడంతో ఐటీ షేర్లు లాభపడ్డాయి.  నిఫ్టీలో జీ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్‌‌, భారతీ ఇన్ఫ్రాటెల్‌‌, ఏసియన్‌‌ పెయింట్స్‌‌, ఐషర్‌‌‌‌ మోటర్స్‌‌, యాక్సిస్‌‌ బ్యాంక్‌‌ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. సన్‌‌ ఫార్మా, టీసీఎస్‌‌, హెచ్‌‌సీఎల్‌‌ టెక్నాలజీస్‌‌, గెయిల్‌‌, ఇన్ఫోసిస్‌‌ షేర్లు టాప్‌‌ గెయినర్లుగా నిలిచాయి. సెక్టార్ల పరంగా చూసుకుంటే ఐటీ, ఫార్మా సెక్టార్లు లాభాల్లో ముగిశాయి. ఆటో, బ్యాంక్‌‌, ఇన్ఫ్రా, ఎఫ్‌‌ఎంసీజీ, మెటల్‌‌ సెక్టార్లు నష్టాల్లో ముగిశాయి. ఇదిలా ఉంటే, ఇండియన్‌‌ కరెన్సీ రూపాయి, డాలర్‌‌‌‌ మారకంలో శుక్రవారం సెషన్‌‌లో ఒక నెల కనిష్టానికి పడిపోయింది. క్రూడ్‌‌ ఆయిల్‌‌ 4 శాతం పైగా పెరగడంతో రూపాయి, డాలర్‌‌‌‌ మారకంలో  42 పైసలు బలహీనపడి 71.80 వద్ద ముగిసింది. గత సెషన్‌‌లో రూపాయి, డాలర్‌‌‌‌ మారకంలో 71.37 వద్ద క్లోజయ్యింది.

రూ.40 వేలు దాటిన బంగారం ధర

అమెరికా రాకెట్ దాడులతో గోల్డ్‌‌ ధరలకు రెక్కలొచ్చాయి. బంగారం ధరలు మళ్లీ రూ.40 వేల పైకి చేరాయి. మధ్య ఆసియా ప్రాంతాల్లో ఉద్రిక్తతలతో పాటు రూపాయి విలువ బలహీనపడటంతో, దేశ రాజధానిలో 10 గ్రాముల బంగారం ధర రూ.752 పెరిగి రూ.40,652గా నమోదైంది. ఎంసీఎక్స్‌‌లో ఫిబ్రవరి నెల గోల్డ్ ఫ్యూచర్స్ కూడా రూ.706 మేర పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధర ఎంసీఎక్స్‌‌లో రూ.39,983కు చేరుకుంది. గత రెండు వారాల నుంచి కూడా బంగారం ధరలు బాగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు వారాల్లో ఏకంగా 10 గ్రాముల బంగారం ధర రూ.2 వేల మేర పెరిగింది. మరోవైపు అమెరికా డాలర్‌‌‌‌ మారకంలో రూపాయి విలువ కూడా పడిపోతోంది. ఇది కూడా గోల్డ్ ధరలు పెరగడానికి ఒక కారణంగా నిలుస్తోంది. వెండి ధరలు కూడా గ్లోబల్, ఇండియా మార్కెట్లలో ర్యాలీ చేస్తున్నాయి. కేజీ వెండి ధర మన మార్కెట్‌‌లో రూ.960 పెరిగి రూ.48,870గా రికార్డయింది. ఎంసీఎక్స్‌‌లో సిల్వర్ ఫ్యూచర్స్ కేజీకి రూ.750 పెరిగి రూ.47,765 వద్ద ట్రేడయ్యాయి. రూ.39,500 వద్ద సపోర్ట్ తీసుకున్న గోల్డ్ ధర, రూ.40 వేల దిశగా పరుగులు పెట్టింది. రూ.47,200 వద్ద సపోర్ట్ తీసుకున్న సిల్వర్, రూ.49 వేల దిశగా కదిలిందని ఎస్‌‌ఎంసీ గ్లోబల్ సెక్యురిటీస్ తెలిపింది. గ్లోబల్‌‌ మార్కెట్లలో కూడా స్పాట్ గోల్డ్ ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి.  ఒక ఔన్స్‌‌ 1,547 డాలర్ల వద్ద ట్రేడైంది.  దాడుల అనంతరం  గోల్డ్‌‌ కొనేందుకే ఇన్వెస్టర్లు మొగ్గుచూపారని, దీంతో గోల్డ్ ధరలు పెరిగాయని హెచ్‌‌డీఎఫ్‌‌సీ సెక్యూరిటీస్ తెలిపింది.